KTR: టీఎస్ ఐపాస్ కు సుజుకి కార్పొరేషన్ చైర్మన్ ప్రశంసలు!

  • జపాన్ లో రెండో రోజూ పర్యటించిన మంత్రి కేటీఆర్ బృందం
  • షిజ్వోకా రాష్ట్రంలో పర్యటించిన బృందం
  • సుజుకి మోటార్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒసాము సుజికితో సమావేశమైన కేటీఆర్

జపాన్ పర్యటనలో భాగంగా తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ బృందం రెండో రోజూ పర్యటించింది. షిజ్వోకా రాష్ట్ర పరిపాలనాధికారులను, పలువురు ప్రముఖ పెట్టుబడిదారులను కలిశారు. ఈరోజు ఉదయం మంత్రి కేటీఆర్ సుజుకి మోటార్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒసాము సుజికితో సమావేశమయ్యారు. ఆటోమొబైల్ రంగాన్ని అత్యంత ప్రాధాన్యత రంగంగా పరిగణిస్తుందని, ఈ రంగంలో రాష్ట్రంలో ఉన్న పెట్టుబడులను సుజుకి చైర్మన్ కు కేటీఆర్ వివరించారు.

ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వ పాలసీలు, టీఎస్ ఐపాస్, సింగిల్ విండో అనుమతుల గురించి వివరించారు. ఈ సందర్భంగా టీఎస్ ఐపాస్ విధానంపై సుజుకి ప్రశంసలు కురిపించారు. కాగా, షిజ్వోకాలో ఉన్న సుజుకి మ్యూజియాన్ని మంత్రి బృందం సందర్శించింది. అనంతరం, షిజ్వోకా రాష్ట్ర గవర్నర్ కవాకాస్తు హైటాతో మంత్రి బృందం సమావేశమైంది.

తెలంగాణ రాష్ట్రం, షిజ్వోకా రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం, వ్యాపారాల సంబంధాలపై చర్చించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అవకాశాలను పరిశీలించేందుకు రావాలని షిజ్వోకా రాష్ట్ర గవర్నర్, ప్రభుత్వ ప్రతినిధులను ఈ సందర్భంగా కేటీఆర్ ఆహ్వానించారు. ఆ తర్వాత షిజ్వోకా బ్యాంకు ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్రంలోని బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో ఉన్న అవకాశాలను వారికి వివరించారు.

ఈ రెండు రంగాల్లోని ప్రపంచ స్థాయి కంపెనీలు ఇప్పటికే హైదరాబాద్ నగరంలో తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, ఈ రంగంలో సేవలందించేందుకు అవసరం అయిన టాలెంట్ తమ నగరంలో అందుబాటులో ఉందని అన్నారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి బృందం సకురాయి లిమిటెడ్, స్టాన్లీ ఎలక్ట్రిక్ కంపెనీ, ఏయస్ టిఐ కంపెనీలకు చెందిన ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఆటోమోటివ్ భాగాలను తెలంగాణలో తయారు చేసేందుకు ముందుకు రావాలని ఎయస్ టిఐ కంపెనీని కేటీఆర్ కోరారు. 

More Telugu News