Jignesh Mevani: స్మృతి ఇరానీకి గుణపాఠం నేర్పండి: రోహిత్ వేముల తల్లికి జిగ్నేష్ మేవాని విజ్ఞప్తి

  • రాధికమ్మ ఎన్నికల్లో పోటీ చేయాలి
  • పార్లమెంటులో స్మృతికి గుణపాఠం నేర్పాలి
  • మోదీ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు

దళిత యువనేత, గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాని మరోసారి వార్తల్లోకి ఎక్కారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఆత్మహత్యకు పాల్పడ్డ రోహిత్ వేముల తల్లికి ఆయన ఓ విన్నపం చేశారు. దళిత పోరాటంలో తమలాంటి వారందరికీ ప్రేరణగా ఉన్న రాధికమ్మకు తాను ఓ విన్నపం చేస్తున్నానని... 2019 ఎన్నికల్లో ఆమె పోటీ చేయాలని కోరారు. ఆ తర్వాత పార్లమెంటులో 'మను'స్మృతి ఇరానీకి గుణపాఠం నేర్పాలని కోరారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. దళితులను స్మృతి ఇరానీ టార్గెట్ గా చేసుకున్నారంటూ... ఆమె పేరు ముందు'మనుస్మృతి'ని చేర్చి అప్పట్లో పలువురు నేతలు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.

రోహిత్ వేముల రెండో వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ కు వచ్చినప్పుడు ఆయన తల్లి రాధికమ్మను జిగ్నేష్ కలిశారు. ఆ సందర్భంగా జిగ్నేష్ మాట్లాడుతూ, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాధికమ్మ పాల్గొంటారని ఆయన అన్నారు. బీజేపీ ఓటమే తమ అంతిమ లక్ష్యమని తెలిపారు. దళిత వ్యతిరేక చర్యలను చేపడుతున్న మోదీ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. దళిత ఉద్యమం దేశంలోని అన్ని మూలలకు వ్యాపించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

More Telugu News