Rajinikanth: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే డీఎంకేదే హవా.. రజనీకాంత్‌ కి అంత సీన్ లేనట్టే!: ఇండియాటుడే సర్వే

  • డీఎంకేకు 130.. రజనీకాంత్‌కు 33 సీట్లు
  • అన్నాడీఎంకేకు దూరమవుతున్న అభిమానులు
  • స్టాలిన్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుందన్న ప్రజలు

జయలలిత మరణం తర్వాత తమిళ రాజకీయాలు దేశం దృష్టిని ఆకర్షించాయి. పార్టీని చేజిక్కించుకునేందుకు శశికళ చేసిన ప్రయత్నాలు.. ఈ క్రమంలో పార్టీ చీలిపోవడం, పన్నీర్ సెల్వం రాజీనామా.. పళని స్వామి ప్రమాణ స్వీకారం.. తర్వాత కలిసిపోవడం.. ఇలా ‘అమ్మ’ మరణం నుంచి ఒక రకంగా రాజకీయ అస్థిరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఏడాదికాలంగా ఊగిసలాడుతూ ఇటీవలే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు.

ఈ క్రమంలో ఇండియా టుడే-కార్వీ సంస్థ నిర్వహించిన తాజా సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు శాసనసభ ఎన్నికలు జరిగితే అతి కష్టం మీద డీఎంకే అధికారంలోకి వస్తుందని తేలింది. అలాగే రజనీకాంత్ పార్టీకి 33 సీట్లు వస్తాయని అంచనా వేసింది. గత ఎన్నికల్లో 135 సీట్లు చేజిక్కించుకున్న జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే అధికారంలోకి రాగా, డీఎంకే 88 సీట్ల వద్దే ఆగిపోయింది.  అయితే ఈసారి 130 సీట్లతో అధికారాన్ని సొంతం చేసుకుంటుందని సర్వేలో వెల్లడైంది. రజనీకాంత్ నేతృత్వంలోని పార్టీకి 33 సీట్లు వస్తాయని పేర్కొంది.

‘అమ్మ’ మరణానంతరం రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఆవరించిందని 65 శాతం మంది అభిప్రాయపడగా, అన్నాడీఎంకేది ఇక చరిత్రేనని దాదాపు సగం మంది పేర్కొన్నారు. అన్నాడీఎంకేలో నెలకొన్న తాజా పరిణామాల కారణంగా ప్రతి ముగ్గురిలో ఒకరు ఆ పార్టీకి దూరమయ్యారు. అన్నాడీఎంకేకు దూరమైన వారిలో 60 శాతం మంది రజనీకాంత్‌వైపు, 26 శాతం మంది డీఎంకేవైపు మొగ్గు చూపుతున్నారు. ఇక స్టాలిన్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని ఎక్కువ మంది అభిప్రాయపడడం విశేషం.

More Telugu News