Andhra Pradesh: పండ్ల పక్వానికి కాల్షియం కార్బైడ్ వాడితే క్రిమినల్ చర్యలు: ఏపీ సీఎస్ దినేష్ కుమార్

  • కృత్రిమ పద్ధతిలో పండ్లను త్వరగా పక్వానికి తెస్తే క్రిమినల్ చర్యలు
  • ‘ఆహార కల్తీ’ అంశంపై సమావేశం
  • కార్బైడ్ వినియోగించిన పండ్లను తింటే అనారోగ్య సమస్యలు

వివిధ రకాల పండ్లను కృత్రిమ పద్ధతిలో త్వరగా పక్వానికి తెచ్చేందుకు కాల్షియం కార్బైడ్ ను వినియోగించే వారిపై చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ స్పష్టం చేశారు. వెలగపూడి సచివాలయంలోని తన కార్యాలయంలో ‘ఆహార కల్తీ’ అంశంపై జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దినేష్ కుమార్ మాట్లాడుతూ, పండ్లను త్వరగా మగ్గబెట్టి మార్కెట్లో అమ్మేందుకు రైతులు, వ్యాపారులు కాల్షియం కార్బైడ్ ను వినియోగిస్తూ ప్రజల ఆరోగ్యానికి తీరని నష్టాన్ని కలిగిస్తున్నారని, ఆ విధంగా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. కార్బైడ్ వినియోగించిన పండ్లను తినడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలపై ప్రజల్లో అవగాహన కలిగించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

అదే సమయంలో పక్వానికి రాకముందే కృత్రిమ పద్ధతుల్లో కాల్షియం కార్బైడ్ వినియోగించిన పండ్లను విక్రయించే వారికి చట్టం గురించి వివరించి, వారిలో అవగాహన పెంపొందించాలని, చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై  క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ విషయమై ప్రజలకు అవగాహన కలిగించేందుకు రేడియో, టీవీ, పత్రికలు, సోషల్ మీడియాతో పాటు ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

ఆహార కల్తీ నియంత్రణకు, ముఖ్యంగా కాల్షియం కార్బైడ్ ద్వారా కృత్రిమ విధానాల్లో పండ్లను మగ్గించి విక్రయించడాన్ని నిరోధించేందుకు మార్కెట్ యార్డులు, ఇతర అవసరమైన ప్రాంతాల్లో టెస్టింగ్ లేబోరేటరీలను ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం ఉన్న వాటిని మరింత బలోపేతం చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అదేవిధంగా, తనిఖీ నియంత్రణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకూ తగిన చర్యలు చేపట్టాని అధికారులను ఆదేశించారు.

ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సవాళ్లలో ఆహార కల్తీ కూడా ఒకటని, దీనిని పూర్తిగా నివారించేందుకు పెద్దఎత్తున చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. విపత్తులను ఏ విధంగా ఎదుర్కొంటామో అదే రీతిలో వీటిని కూడా ఎదుర్కొనేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి దానిని అమలు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు.  


అనంతరం, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య మాట్లాడుతూ కృత్రిమ పద్ధతిలో పండ్లను మగ్గబెట్టేందుకు కాల్షియం కార్బైడ్, ఇతర రసాయనాల వినియోగం నివారించేందుకు స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక విధానం ద్వారా తీసుకోవాల్సిన చర్యలపై కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టు వివరించారు. రైతులు పండించిన పంటను పూర్తిగా పక్వానికి రాకముందే ప్రకృతి వైపరీత్యాలకు భయపడి, లాభాపేక్ష దృష్ట్యా కృత్రిమ పద్ధతుల్లో వాటిని పక్వానికి తీసుకువచ్చి విక్రయించేందుకు ప్రయత్నం చేస్తుంటారని తెలిపారు.

అలాగే వివిధ పండ్ల వర్తకులు తగిన స్టోరేజి సౌకర్యాలు అందుబాటులో లేక కాల్షియం కార్బైడ్, ఇతర రసాయన పదార్థాలు వినియోగించి పండ్లను త్వరగా మగ్గించి విక్రయించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు. ఈ పద్ధతులను నివారించేందుకు రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో అవసరమైన ఇథలిన్ చాంబర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరుగుతోందని చెప్పారు.

కాల్షియం కార్బైడ్ వినియోగం నిషేధంపై జిల్లా స్థాయిలో జిల్లా సంయుక్త కలెక్టర్ నేతృత్వంలోని కమిటీలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఆహార కల్తీ నియంత్రణ విభాగాన్ని మరింత పటిష్టవంతం చేసేందుకు ఖాళీగా ఉన్న పుడ్ సేప్టీ అధికారులను నియమించేందుకు చర్యలు తీసుకోవడంతోపాటు సంస్థాపరమైన సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉందని తెలిపారు.

 మీడియా, సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో విస్తృత అవగాహనకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆమె వివరించారు. విశాఖలో ఉన్న లేబరేటరీని మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవడంతోపాటు తిరుపతి, గుంటూరు తదితర ప్రాంతాల్లో ల్యాబ్ లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉందని ఆమె పేర్కొన్నారు.

More Telugu News