Vangaveeti Radha: వైఎస్ జగన్ రెండు సార్లు స్వయంగా బుజ్జగించినా వినని వంగవీటి రాధ!

  • రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది లేకుండా చూస్తానని జగన్ హామీ
  • అయినా వినని వంగవీటి రాధ
  • మల్లాది విష్ణు వైకాపాలో చేరికతో మారిన సమీకరణలు
  • ఇప్పుడు యలమంచిలి రవి కూడా రానుండటంతోనే రాధ కినుక

వంగవీటి రాధ అసంతృప్తిగా ఉన్నారని తెలుసుకున్న వైకాపా అధినేత వైఎస్ జగన్, రెండుసార్లు తన వద్దకు పిలిపించుకుని స్వయంగా బుజ్జగించినా, ఆయన వినలేదని, పార్టీ మారేందుకే మొగ్గు చూపారని తెలుస్తోంది. మల్లాది విష్ణును పార్టీలోకి తెచ్చినా, రాధ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది లేకుండా చూస్తానని జగన్ హామీ ఇచ్చారని, అయితే, విష్ణుకు విజయవాడ సెంట్రల్ ఆఫర్ చేయడంతోనే వివాదం పెరిగిందని సమాచారం. వైకాపా నేతల నుంచి అందిన సమాచారం ప్రకారం, జగన్ స్వయంగా రాధను హైదరాబాద్ కు ఆహ్వానించి రెండు సార్లు మాట్లాడారు.

అసెంబ్లీ టికెట్లను ఇచ్చే క్రమంలో ఏమైనా ఇబ్బందులు వస్తే, వంగవీటి రాధ గతంలో పోటీ చేసిన విజయవాడ తూర్పు నియోజకవర్గాన్ని అయినా ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు. అదే సమయంలో మాజీ ఎమ్మెల్యే, గతంలో పీఆర్పీ నుంచి పోటీ చేసిన విజయవాడ తూర్పు కీలక నేత యలమంచిలి రవి వైకాపాలోకి వస్తున్నారని వార్తలు వచ్చాయి. దీంతో యలమంచిలి రవికి విజయవాడ తూర్పును కేటాయిస్తానని జగన్ హామీ ఇచ్చారని కూడా సమాచారం. ఈ నేపథ్యంలో తనకు విజయవాడ తూర్పు సెగ్మెంట్ కూడా దక్కదన్న అనుమానమే రాధను టీడీపీ వైపు వెళ్లేలా చేసిందని తెలుస్తోంది. మరోవైపు తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం రాధ పార్టీలో చేరడం ఖాయమని, ఎమ్మెల్యేగా ఆయన గెలిచి, టీడీపీ అధికారంలోకి వస్తే, మంత్రి పదవిని కూడా ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారని చెబుతున్న పరిస్థితి. అదే హామీని వంగవీటి రాధకు ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.

More Telugu News