Vijayawada: మల్లాది విష్ణుకు 'విజయవాడ సెంట్రల్'ను ఖాయం చేసిన జగన్... రాధ టీడీపీ వైపు మొగ్గడానికి కారణమిదే!

  • ఇప్పటికే మల్లాది విష్ణుకు 'విజయవాడ సెంట్రల్' ఇస్తానన్న వైఎస్ జగన్
  • తన సీటును ప్రత్యర్థికి ఇస్తాననడంపై రాధ కినుక
  • అదే సీటు కన్ఫార్మ్ చేస్తేనే టీడీపీలోకి మారతానని చెప్పిన రాధ!
  • ఆసక్తికరంగా మారుతున్న విజయవాడ రాజకీయాలు

విజయవాడ రాజకీయాలను సమూలంగా మార్చనున్న ఓ వార్త ఉదయం నుంచి టీవీ చానళ్లలో చక్కర్లు కొడుతుండగా, ప్రజలంతా ఇప్పుడు దాని గురించే చర్చించుకుంటున్నారు. మూడు నాలుగు నెలల క్రితం వరకూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ వెంటే నడిచి, ఆపై పార్టీకి కాస్తంత దూరమైనట్టు కనిపించిన విజయవాడ కాపు సామాజిక వర్గం కీలక నేత వంగవీటి రాధ, తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్టు ఫ్లాష్ అయిన వార్త పెను సంచలనాన్నే కలిగించింది. ఆయన చేరికపై అధికారిక ప్రకటన వెలువడక పోయినప్పటికీ, ఇప్పుడు విజయవాడ ప్రాంతంలో ఏ ఇద్దరు కలిసినా ఈ విషయంపైనే చర్చ సాగుతోంది.

ఇదిలావుండగా, కొద్దికాలం క్రితం మల్లాది విష్ణు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలో ఆయనకు విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ టికెట్ ను వైఎస్ జగన్ కన్ఫార్మ్ చేశారన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఆ సీటుపై వంగవీటి రాధ ఎప్పటినుంచో ఆశలతో ఉన్నారు. విష్ణు రంగ ప్రవేశం తరువాతనే రాధ తొలిసారిగా తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇక ఇప్పుడు రాధ టీడీపీ నుంచి ఆ సీటు తనకిస్తానన్న హామీ వస్తే, పార్టీ మారుతానని చెప్పినట్టు ఆయన అనుచర వర్గం అంటున్న పరిస్థితి. వాస్తవానికి విజయవాడ సెంట్రల్ పరిధిలో మల్లాది విష్ణుతో పోలిస్తే, వంగవీటి రాధ బలమైన నేతగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో రాధకు టీడీపీ నుంచి అసెంబ్లీ సీటును ఆఫర్ చేయవచ్చని తెలుస్తోంది.

More Telugu News