south korea: దక్షిణ కొరియాలో కేటీఆర్ బిజీబిజీ.. పలువురితో చర్చలు.. ఫొటోలు చూడండి!

  • టెక్స్‌టైల్ పరిశ్రమల సీఈవోలు, చైర్మన్లతో సియోల్ నగరంలో సమావేశం
  • కాకతీయ టెక్స్‌టైల్‌ పార్కులో పెట్టుబడులు పెట్టాలని కోరిన మంత్రి బృందం
  • హ్యూందయ్ సంస్థతో సమావేశం, ఆటోమోబైల్ పెట్టుబడులకు అహ్వానం
  • కొరియా మొబైల్ ఇంటర్నెట్ బిజినెస్ అసోసియేషన్ తో తెలంగాణ ప్రభుత్వ యంవోయూ

రెండు రోజుల పర్యటన కోసం దక్షిణ కొరియాలో ఉన్న తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ బృందం పలు కంపెనీల సీఈవోలు, కంపెనీల ప్రతినిధుల సమావేశాలతో బిజీబిజీగా గడిపింది. వివిధ కంపెనీలను కలిసిన మంత్రి బృందం తెలంగాణలో ఉన్న వ్యాపార, పెట్టుబడుల అవకాశాలను వివరించింది. ముఖ్యంగా ఆటోమోబైల్, టెక్స్‌టైల్స్, ఫార్మ, ఐటీ రంగాల్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కేటీఆర్ కోరారు. ఆటోమోబైల్ దిగ్గజం హ్యూందయ్ కార్పొరేషన్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు నామ్ గుహ్నోతో సమావేశమయ్యారు.

తెలంగాణలోని ఆటోమోబైల్ రంగంలో ఉన్న పెట్టుబడుల అవకాశాలను వివరించారు. ముఖ్యంగా టీఎస్ఐపాస్ ద్వారా సింగిల్ విండో అనుమతుల విధానం పైన హ్యూందయ్ ప్రతినిధులు అభినందనలు తెలిపారు. హ్యూందయ్ రోటెమ్, గ్లోబల్ రైల్వే విభాగం డైరెక్టర్ కె.కె యూన్ తో కూడా కేటీఆర్ సమావేశం అయ్యారు. గ్రీన్ ఎనర్జీలో అగ్రగామిగా ఉన్న ఒ.సి.ఐ సీఈవో వూహ్యుమ్ లీతో సమావేశం అయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా ముప్పై మూడు ప్రాంతాల్లో తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఈ కంపెనీకి తెలంగాణలోనూ బ్రాంచులు ప్రారంభించాలని కేటీఆర్ అహ్వానించారు.

మొబైల్ ఇంటర్నెట్ బిజినెస్ అసోసియేషన్ (మెయిబా)తో మంత్రి కేటీఆర్ ప్రతినిధి బృందం సమావేశం అయింది. మెయిబా సీఈవో చోయి డాంగ్ జిన్ తో జరిగిన ఈ సమావేశంలో సంస్థ ప్రతినిధులను ఫిబ్రవరిలో తెలంగాణలో జరగనున్న ప్రపంచ ఐటీ కాంగ్రెస్ కు అహ్వానించారు. 500లకు పైగా కంపెనీలు సభ్యులుగా ఉన్న ఈ సంస్థతో తెలంగాణ ప్రభుత్వం ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఒప్పందం మేరకు మోయిబా (Korea Mobile Internet Business Association) తెలంగాణ ప్రభుత్వంతో కలిసి ఇంటర్నెట్ అఫ్ థింగ్స్, వర్చువల్ రియాలిటీ , ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ వంటి అంశాల్లో పనిచేస్తాయి.

అలాగే, మంత్రి కేటీఆర్ టెక్స్ టైల్ పరిశ్రమల వర్గాలతో సమావేశం అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోన్న కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు,  టెక్స్ టైల్ రంగంలోని పెట్టుబడులకు ఆకర్షణీయ ప్రదేశమని, పెట్టబడులతో ముందుకు వచ్చే కంపెనీలకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వ పాలసీలు, టీఎస్ఐపాస్ వంటి ముఖ్యాంశాలను మంత్రి వారికి వివరించారు. ముఖ్యంగా  టెక్స్ టైల్  పరిశ్రమల సమాఖ్య కోఫోతి (KOFOTI) చైర్మన్ కిహూక్ సుంగ్, ఇతర కంపెనీల ప్రతినిధులతో సమావేశం అయ్యారు.

కిహుక్ చైర్మన్ గా ఉన్న యంగ్వాన్ సంస్థ ఇప్పటికే కాకతీయ టెక్స్ టైల్  పార్కులో 300 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. యంగ్వాన్ సంస్థ నార్త్ ఫేస్ అనే బ్రాండ్ పేరుతో వస్త్రాలను తయారు చేస్తుంది. ఈ బ్రాండ్ రానున్న ఒలింపిక్స్ క్రీడలకు అధికారిక భాగస్వామిగా ఉంది. మంత్రి మరో ప్రముఖ టెక్స్ టైల్ సంస్థ హ్యోసంగ్ ఉపాధ్యక్షుడు జె జూంగ్ లీతో సమావేశమై టెక్స్ టైల్  పార్కులో పెట్టుబడి పెట్టాలని కోరారు. ఈ సమావేశానంతరం మంత్రి డైటెక్ (Korea Dyeing & Finishing Tech Institute (DYETEC) ప్రతినిధులతో సమావేశం అయ్యారు.

డైటెక్ అధ్యక్షుడు యూన్ నామ్ సిక్ తో సమావేశం అయిన మంత్రి మెగా టెక్స్ టైల్ పార్కులో వాటర్ ట్రీట్ మెంట్, మానవ వనరుల నిర్వహణ వంటి అంశాల్లో సాంకేతిక సహకారమందించాల్సిందిగా కోరారు. డైటెక్ పరిశ్రమలో మంత్రి బృందం పర్యటించింది. మరొక ప్రముఖ టెక్స్ టైల్ దిగ్గజ సంస్థ కోలాన్ గ్రూపుతో కూడా మంత్రి సమావేశం అయ్యారు. కొరియా టెక్స్ టైల్ సిటీగా పేరుగాంచిన దైగు ( Daegu) మెట్రోపాలిటన్ నగరాన్ని మంత్రి ప్రతినిధి బృందం సందర్శించింది. ఈ నగరంలో కొరియన్  టెక్స్ టైల్ , ఫ్యాషన్, హై టెక్నాలజీ పరిశ్రమలకు కేంద్రంగా ఉంది.

ఈ నగర డిప్యూటీ మేయర్ కిమ్ యాన్ చాంగ్ తో సమావేశం అయిన మంత్రి నగరంలో టెక్స్ టైల్ పరిశ్రమల పారిశ్రామిక ప్రగతి పైన చర్చించారు. దైగు నగర ఇన్నోవేషన్, అర్థిక విభాగ బృందంతో సమావేశం అయిన కేటీఆర్.. వారిని ఇమేజీ టవర్ ప్రాజెక్టులో భాగస్వాములు కావాలని కోరారు. మంత్రి కేటీఆర్ వెంట తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎంపీ వివేక్ తోపాటు పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, ఇతర అధికారులున్నారు.         

More Telugu News