Chandrababu: నారావారిపల్లెకు సంక్రాంతి శోభ... అక్కడికి చేరుకున్న ‘నారా’, ‘నందమూరి’ కుటుంబాలు

  • సంక్రాంతి రోజున ఎవరి ఊరుకు వారు రావాలి : చంద్రబాబు
  • అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు : భువనేశ్వరి
  • సకుటుంబ సపరివార సమేతంగా పండగ చేసుకుంటా : బాలకృష్ణ

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సొంతూరు నారావారిపల్లె సంక్రాంతి శోభతో కళకళలాడుతోంది. సంక్రాంతి పండగ నేపథ్యంలో ‘నారా’, ‘నందమూరి’ కుటుంబాలు చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లెకు ఇప్పటికే చేరుకున్నాయి. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, సంక్రాంతి రోజున ప్రపంచంలో ఎక్కడున్నా, ఎవరి ఊరుకు వారు రావాలని, ‘జన్మభూమి’ రుణం తీర్చుకోవాలని అన్నారు. ‘మా మిసెస్ అయితే, ప్రతి సంవత్సరం ఇక్కడి (నారావారిపల్లె)కి వచ్చే సంప్రదాయాన్ని తీసుకువచ్చింది’ అని అన్నారు.

పండగ సందర్భంగా అన్ని సిటీలు ఖాళీ అయ్యాయని, ఎవరి గ్రామాలకు వారు వెళ్లిపోతున్నారని.. ఇది చాలా మంచి సంప్రదాయమని అన్నారు. ఇలాంటి సంప్రదాయం వల్ల రాబోయే రోజుల్లో చాలా మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. కాగా, అక్కడ నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ‘సంక్రాంతి అప్పుడు, మిగిలిన పండగలప్పుడు మనం, మన పిల్లలతో మన గ్రామాలకు వెళ్లాలి. తద్వారా మన సంప్రదాయాలు మనకు గుర్తుంటాయి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతున్నా’ అన్నారు.

నారావారిపల్లెకు చేరుకున్న ఎమ్మెల్యే, ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణకు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, ‘సకుటుంబ సపరివార సమేతంగా ఈ పండగ చేసుకునేందుకు నారావారిపల్లెకు వచ్చాను. ఈ  పండగకు మా సినిమా ‘జై సింహా’ విడుదలైంది. సకుటుంబ సపరివార సమేతంగా అందరూ చూడదగ్గ సినిమా ఇది. ఈ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు’ అన్నారు.

More Telugu News