cpi: సీబీఐ కోర్టు జడ్జి లోయాను చంపేశారు.. ఇందులో అమిత్ షా ప్రమేయం ఉంది!: సీపీఐ నారాయణ ఆరోపణ

  • న్యాయవ్యవస్థలో సంక్షోభం మొదలైంది
  • మెడికల్ కుంభకోణం కేసులో జడ్జిలను మార్చేశారు
  • ‘పోలవరం’ పునరావాస నిధులపై కేంద్రం హామీ ఇవ్వలేదు

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై సీపీఐ నేత నారాయణ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, సోహ్రాబుద్దీన్ నకిలీ ఎన్ కౌంటర్ కేసులో వాదనలు వింటున్న సీబీఐ ప్రత్యేక కోర్టుజడ్జి లోయా మృతి కేసులో బీజేపీ అమిత్ షా ప్రమేయం ఉందని ఆరోపించారు. జడ్జి లోయాను చంపేశారని, ఈ కేసులో అమిత్ షా ప్రమేయం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

న్యాయవ్యవస్థలో సంక్షోభం మొదలైందని, కల్కాపూర్ న్యాయమూర్తి ఆత్మహత్య చేసుకున్నారని, వేల కోట్ల రూపాయల మెడికల్ కుంభకోణం జరిగితే, జడ్జిలను మార్చి కేసులను నిర్వీర్యం చేశారని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు గురించి ఆయన ప్రస్తావిస్తూ, నిర్వాసితుల పునరావాసానికి రూ.32 వేల కోట్లు కావాలని, పునరావాస నిధులపై కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వలేదని, విభజన హామీలపై కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో లేదని విమర్శించారు. అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు ఇప్పిస్తానని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ చెప్పడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని మండిపడ్డారు.

More Telugu News