China: పాక్ పై కాదు.. చైనా సరిహద్దులపై దృష్టి సారించాల్సి సమయం వచ్చింది.. చైనాతో ముప్పే: ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు

  • చైనాతో ఏ క్షణంలోనైనా ముప్పే
  • చైనా సరిహద్దుల్లో మిలిటరీ మౌలిక వసతులు పెంచాలి
  • చైనా గీత దాటితే.. తిప్పి కొట్టే సత్తా మనకుంది

ఇప్పటిదాకా పాకిస్థాన్ పైనే దృష్టి సారించామని, ఇకపై చైనా సరిహద్దులపై కన్నేయాల్సిన సమయం ఆసన్నమైందని ఇండియన్ ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ అన్నారు. మన పొరుగు దేశాలను మచ్చిక చేసుకుని, మనకు ఇబ్బందులను కలిగించేందుకు చైనా కుట్రలకు పాల్పడుతోందని ఆయన తెలిపారు. పొరుగు దేశాలతో సంబంధాలను మెరుగు పరుచుకోవాలని చెప్పారు. సరిహద్దుల్లో డూకుడు పెంచుతూ, భారత్ పై ఒత్తిడి పెంచేందుకు చైనా యత్నిస్తోందని ఆయన విమర్శించారు. ఈ నేపథ్యంలో, చైనా సరిహద్దులపై దృష్టి సారించాలని, ఉత్తర ప్రాంతంలో మిలిటరీకి సంబంధించిన మౌలిక వసతుల కల్పనలో వేగం పెంచాలని అన్నారు. చైనా మిలిటరీ నుంచి మనకు ఏ క్షణంలోనైనా ముప్పు వాటిల్లే అవకాశం ఉందని చెప్పారు. చైనా ఎలాంటి చర్యలకు దిగినా సమర్థవంతంగా తిప్పికొట్టే సత్తా మన సైన్యానికి ఉందని అన్నారు.

ఉత్తర డోక్లాంలో చైనా తన సైన్యాన్ని మోహరిస్తోందని ఆర్మీ చీఫ్ తెలిపారు. శీతాకాలం ముగిసిన వెంటనే, సరిహద్దుల్లోని కేంద్రాల్లో కూడా చైనా బలగాలు మోహరించే అవకాశం ఉందని అన్నారు. దీనికి అనుగుణంగానే భారత బలగాలను కూడా మోహరింపజేస్తామని చెప్పారు. భారత భూభాగంలోకి చైనా సైన్యం చొచ్చుకొచ్చేందుకు యత్నిస్తే... సరైన సమాధానం ఇస్తామని తెలిపారు. నేపాల్, మయన్మార్, బూటాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలతో సంప్రదింపులను కొనసాగిస్తూ, చైనాతో అనుసరించాల్సిన వ్యూహంపై దృష్టిని సారించాలని అన్నారు. భారత్ కు దూరంగా ఈ దేశాలు వెళ్లకుండా చూసుకోవాలని తెలిపారు. 

More Telugu News