KTR: మంత్రి కేటీఆర్ చొరవతో అసిస్టెంట్ ప్రొఫెసర్ అయ్యేందుకు అర్హత సాధించిన అటెండర్!

  • దివ్యాంగుడు నర్సింహులును అభినందించిన కేటీఆర్
  • రెండు లక్షల రూపాయల ఆర్థిక సాయం
  • నర్సింహులు కుటుంబానికి ఒక డబుల్ బెడ్ రూం ఇల్లు

ఈరోజు యువజన దినోత్సవం జరుపుకుంటున్న యువతకు పిట్ల నర్సింహులు ఆదర్శం కావాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలానికి చెందిన దళిత యువకుడు, దివ్యాంగుడు నర్సింహులు అటెండర్ స్థాయి నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ కావడానికి అర్హత సాధించిన అతన్ని కేటీఆర్ తన కార్యాలయానికి పిలిపించుకుని అభినందించారు. ఆర్థికసాయం కింద రెండు లక్షల రూపాయలు అందజేశారు.

పూరి గుడిసెలో నివసిస్తున్న నర్సింహులు కుటుంబానికి ఒక డబుల్ బెడ్ రూం ఇల్లు నిర్మించి ఇస్తామని, వచ్చే దసరా నాటికి కొత్త ఇంటిలో ఉండటం ఖాయమని నర్సింహులుకు ఆయన మాట ఇచ్చారు. నర్సింహులు గురించి చెప్పాలంటే... ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పీజీ పూర్తి చేశాడు. ఇంకా పైచదువులు చదివి పెద్ద ఉద్యోగం చేయాలనుకున్నాడు. అయితే, వృద్ధులైన తల్లిదండ్రులు, మరోవైపు పెళ్లీడుకొచ్చిన నలుగురు చెల్లెళ్లు ఉండటంతో అతను ముందడుగు వేయలేకపోయాడు.

దీంతో ఏదో ఒక ఉద్యోగం చేసి తన కుటుంబాన్నిపోషించాలని అనుకున్నాడు. ఈ క్రమంలో సిరిసిల్ల, కరీంనగర్ లో ఉద్యోగ ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. ఓ రోజు మంత్రి కేటీఆర్ గ్రామసభ జరుగుతోందని తెలుసుకుని అక్కడికి వెళ్లాడు. మంత్రిని కలిసి తన పరిస్థితి విన్నవించుకోవడంతో సిరిసిల్లలోని వెన్నెల జూనియర్ కాలేజీలో ఉద్యోగం ఇప్పించారు. నర్సింహులు పై చదువులకు అండగా నిలుస్తానని, ఏ సాయం కావాలన్నా చేసేందుకు తాను సిద్ధంగా ఉంటానని నాడు కేటీఆర్ అతనికి హామీ ఇచ్చారు.

ఈ క్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత పరీక్ష JRF కు ప్రిపేర్ అయ్యాడు. ఈ అర్హత పరీక్షలో పాస్ అయిన నర్సింహులు, జూనియర్ రీసెర్చ్ ఫెలో షిప్ సాధించాడు. తనకు ఉద్యోగం ఇప్పించిన మంత్రి కేటీఆర్ కు, ఆ ఉద్యోగం ఇచ్చిన కాలేజీ ప్రిన్సిపాల్ చైతన్య కుమార్ కు తాను జీవితాంతం రుణపడి ఉంటానని నర్సింహులు అన్నాడు. అంగ వైకల్యం కష్టపెడుతున్నా, పేదరికం అవస్థ పెడుతున్నా, తన తల్లిదండ్రులు మాత్రం తనను ఎన్నడూ చదువుకు దూరం చేయలేదని అన్నాడు.

More Telugu News