indira gandhi: ఇందిరాగాంధీ పాత్రలో విద్యాబాలన్ నటించడమా, ఇది సహించరాని విషయం!: ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ దర్శకుడు కేతిరెడ్డి

  • 'డర్టీ పిక్చర్' లాంటి చిత్రంలో నటించిన నటి ఇందిర పాత్రలోనా?
  • ఇందిరాగాంధీ అభిమానులను కలతకు గురిచేస్తోంది
  • ఆ ప్రయత్నాలను విరమించుకోవాలి
  • ‘ఫేస్ బుక్’లో ఓ పోస్ట్ చేసిన కేతిరెడ్డి

'ఇందిర: ఇండియాస్ ప‌వ‌ర్‌ఫుల్ ప్రైమ్ మినిస్ట‌ర్‌' పేరుతో ప్ర‌ముఖ ర‌చ‌యిత్రి సాగ‌రికా ఘోష్ రాసిన న‌వ‌లను వెబ్‌సిరీస్‌గా గానీ, సినిమాగా గానీ తెర‌కెక్కించ‌నున్న విషయం తెలిసిందే. ఈ పుస్తకం హక్కులను రాయ్ కపూర్ ప్రొడక్షన్స్ కొనుగోలు చేసింది. ఇందిరాగాంధీ పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటించనుంది.

అయితే, ఒక గొప్ప నాయకురాలి పాత్రలో విద్యాబాలన్ నటించనుండటంపై ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. డర్టీ పిక్చర్ లాంటి చిత్రంలో నటించి ప్రేక్షకులలో ఒక డిఫరెంట్ స్థానం పొందిన విద్యాబాలన్ ఈ పాత్రలో నటించాలనుకోవడం సబబు కాదని అన్నారు. ఇందిరాగాంధీ అభిమానులను కలతకు గురిచేస్తోందని, ఆ పాత్రలో ఆమె నటించకూడదని, ఆ ప్రయత్నాలను విరమించుకోవాలని అన్నారు. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు.

ఆ పోస్ట్ లో కేతిరెడ్డి ఏమన్నారంటే.. ఈ దేశ సమైక్యత సమర్ధతను కాపాడే ప్రయత్నంలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఒక మహిళానేత పాత్రలో మిమ్మల్ని ఊహించుకోవడం కష్టమని అన్నారు. వెంటనే ఈ ప్రయత్నాన్ని మానుకోకపోతే ఇందిరను అభిమానించే వారి ఆగ్రహానికి ఆమె గురికాక తప్పదని హెచ్చరించారు. కళాకారులు ఏ పాత్రను అయినా పోషించవచ్చని, కానీ వారు గతంలో పోషించిన పాత్రల ప్రభావం ఈ పాత్రపై ఉంటుందని అన్నారు. కనుక ఈ సినిమాలో పాత్రల ఎంపిక ప్రధాన పాత్ర పోషిస్తుందనే విషయాన్ని ఆ చిత్ర నిర్మాత గుర్తుంచుకోవాలని, లేకుంటే, ఎంతో ఖర్చు పెట్టి సినిమా తీసిన తర్వాత ప్రజాగ్రహానికి గురికాక తప్పదని అన్నారు.

ఆ తర్వాత కోర్టుల చుట్టూ తిరగడం కంటే, ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని, ఇలాంటి చిత్రాలు నిర్మించేటప్పుడు ఆచితూచి అడుగులేయాలని సూచించారు. ఉదాహరణకు నరేంద్రమోదీ పాత్రలో శక్తికపూర్ వంటి నటుడు నటిస్తే ప్రజలు ఒప్పుకుంటారా? అని కేతిరెడ్డి ప్రశ్నించారు.  

More Telugu News