రాజ్యాంగాన్ని నమ్మకపోతే మరి దేన్ని నమ్ముతారు?: జమ్మూకశ్మీర్ ప్రజలకు సీఎం మెహబూబా ప్రశ్న

11-01-2018 Thu 13:51
  • రాజ్యాంగాన్ని విశ్వసించకపోతే రాష్ట్రాభివృద్ధికి ఆటంకం 
  • ఎన్నో అధికారాలు కలిగిన అసెంబ్లీ మనది 
  • ఆయుధాలు పట్టొద్దని యువతకు సీఎం  హితవు 
జమ్మూకశ్మీర్ ప్రజలకు అర్థమయ్యే భాషలో, పాకిస్తాన్ పై ఉన్న భ్రమలను తొలగించే విధంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబాముఫ్తి హితవు పలికారు. ఆయుధాలు పట్టొద్దని జమ్మూ కశ్మీర్ యువతకు ఆమె పిలుపునిచ్చారు. జమ్మూ కశ్మీర్ ప్రజలు ఏదైనా పొందాలంటే అది భారత దేశం నుంచి మాత్రమే సాధ్యమని, మరెక్కడి నుంచో రాదన్నారు. భారత రాజ్యంగం పట్ల విశ్వాసం లేకపోతే రాష్ట్రాభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుందని వివరించే ప్రయత్నం చేశారు.

‘‘జమ్మూ కశ్మీర్ రాజ్యాంగాన్ని విశ్వసించకపోతే, భారత రాజ్యాంగాన్ని నమ్మకపోతే మరి దేన్ని నమ్ముతారు? అప్పడు మీరు పొందేది ఏముంటుంది? ఏదైనా కావాలంటే ఎక్కడి నుంచి పొందుతారు?’’ అంటూ ఆమె ప్రశ్నలు కురిపించారు. ‘‘దేశంలోనే ఎన్నో అధికారాలు కలిగిన అసెంబ్లీ మనది. జీఎస్టీి జమ్మూకశ్మీర్ మినహా దేశవ్యాప్తంగా ఒకేసారి అమల్లోకి వచ్చింది. కానీ, ఇక్కడ మాత్రం అసెంబ్లీలో తగినంత అర్ధవంతమైన చర్చ తర్వాతే అమలు చేయడం జరిగింది’’ అని మెహబూబా అన్నారు.