america: అమెరికా ప్రతినిధుల సభలో కొత్త బిల్లు.. గ్రీన్ కార్డుల జారీ సంఖ్య పెంపు!

  • గ్రీను కార్డులను ఏటా 45 శాతం పెంచే ప్రతిపాదన
  • ప్రతిభగల నిపుణుల రాకను 2.6 లక్షలకే పరిమితం చేయాలి
  • ప్రస్తుతం ఇది ఏటా 10.50 లక్షలుగా ఉంది
  • బిల్లు ఆమోదం పొంది చట్టరూపం దాలిస్తే భారతీయులకు లబ్ది

భారతీయులకు ఉపశమనం కల్పించే పరిణామం అమెరికాలో చోటు చేసుకుంది. ప్రతిభగల వారికే ప్రవేశానికి అవకాశం, గ్రీన్ కార్డులను వార్షికంగా 45 శాతం పెంచే ప్రతిపాదనలతో కూడిన బిల్లును అక్కడి ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. అమెరికాలో నివాస హోదా కల్పించే గ్రీన్ కార్డులను సొంతం చేసుకునే వారిలో సింహ భాగం భారతీయులేనన్న విషయం తెలిసిందే.

ఈ కొత్త బిల్లు చట్టంగా మారితే భారత ఐటీ ఇంజనీర్లకు ప్రయోజనం చేకూరుతుందన్న విశ్లేషణ వినిపిస్తోంది. ట్రంప్ సర్కారు మద్దతుతో ప్రతినిధుల సభ ముందుకు చేరిన ఈ బిల్లు ఆమోదం పొంది, అధ్యక్షుడి సంతకం కూడా పూర్తయి చట్టంగా మారితే, ప్రస్తుతమున్న వివిధ రకాల వీసాలకు చెక్ పడుతుంది.

ప్రస్తుతం అమెరికా ఏటా 10.50 లక్షల మంది నిపుణులకు ఇమిగ్రేషన్ అవకాశం కల్పిస్తుండగా, కొత్త బిల్లు చట్టంగా మారితే ఈ సంఖ్య 2.6 లక్షలకు తగ్గిపోతుంది. అంటే భారీ సంఖ్యలో నిపుణుల రాకకు అమెరికా ఈ బిల్లుతో చెక్ పెడుతోంది. ఒక విధంగా ఇది ప్రతికూలతే. మరోపక్క, ప్రస్తుతం ఏటా 1,20,000 లక్షల గ్రీన్ కార్డులను ఇస్తుండగా, ఈ సంఖ్యను 45 శాతం పెంపుతో 1,75,000 చేయాలని ఈ బిల్లులో ప్రతిపాదించారు.

భారత ఐటీ ఇంజనీర్లు హెచ్1బి వీసాతోనే అమెరికాలో అడుగుపెడుతున్నారు. ఆ తర్వాత గ్రీన్ కార్డులకు దరఖాస్తు చేసుకుని శాశ్వత నివాస హోదా పొందుతున్నారు. ఓ అంచనా ప్రకారం అమెరికాలో సుమారు 5 లక్షల మంది భారతీయ నిపుణులు గ్రీన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుని వేచి చూస్తున్నారు. కొత్త చట్టం వస్తే వీరి కలలు నెరవేరేందుకు మార్గం సుగమం అవుతుంది.

More Telugu News