Suresh Rathore: శుభలేఖపై ప్రభుత్వ లోగో.. 'పెళ్లన్నాక కాస్త వెరైటీ ఉండాలి తమ్ముడూ' అంటున్న ఎమ్మెల్యే పెళ్లి కొడుకు!

  • జ్వాలాపూర్ బీజేపీ ఎమ్మెల్యే వెరైటీ వెడ్డింగ్ కార్డ్
  • ప్రభుత్వ లోగో ముద్రించి విమర్శలపాలవుతున్న శాసనసభ్యుడు
  • తాను కూడా గవర్నమెంటేనన్న వైనం

పెళ్లంటే పందిళ్లు సందళ్లు తప్పెట్లు.. తాళాలు తలంబ్రాలు.. అన్నాడో కవి. పెళ్లంటే.. మూడు ముళ్లు.. ఏడు అడుగులు మాత్రమే కాదు, అంతకుమించి! అందుకనే జీవితంలో మర్చిపోలేని విధంగా చేసుకునేందుకు ప్రతి ఒక్కరు ఉవ్విళ్లూరుతారు. అయితే, అంతకు మించి ఘనంగా, వెరైటీగా చేసుకోవాలనుకున్నాడో శాసన సభ్యుడు. అందుకనే తన పెళ్లి చిరకాలం గుర్తుండిపోయేలా పెళ్లి పత్రికపై ఏకంగా రాష్ట్ర ప్రభుత్వ లోగోనే ముద్రించేసి అధికారికం చేసుకున్నారు.

ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ జిల్లా జ్వాలాపూర్ నియోజవర్గ బీజేపీ ఎమ్మెల్యే సురేశ్ రాథోడ్‌కు పెళ్లి కుదిరింది. ఎమ్మెల్యే పెళ్లి అంటే మాటలా.. వివాహ ఆహ్వాన పత్రికను బ్రహ్మాండంగా తయారుచేయించారు. అంతేనా? శుభలేఖ ఎడమవైపున  పైభాగంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వ లోగోను ముద్రించారు. కింద తన పేరు వేయించుకున్నారు.

ప్రభుత్వ లోగోను శుభలేఖపై వాడుకోవడంపై రాథోడ్ స్పందిస్తూ.. తాను చేసింది  నేరమేమీ కాదని సమర్థించుకున్నారు. ప్రభుత్వంలో తాను కూడా భాగమేనని పేర్కొన్న ఆయన, గతంలోనూ ఎంతోమంది ఇలా ప్రభుత్వ లోగోను అచ్చు వేయించుకున్నారని పేర్కొన్నారు. తనను విమర్శిస్తున్న వారు తానో పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్న విషయాన్ని గుర్తెరగాలని హితవు పలికారు. నిజానికి ప్రభుత్వ చిహ్నాలను వ్యక్తిగతంగా ఉపయోగించుకోవడం నేరం. ఉపయోగించుకోవాలని ముచ్చటపడితే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. అయితే ఎమ్మెల్యే మాత్రం ప్రభుత్వ అనుమతి తీసుకోకుండానే ఇలా లోగోను అచ్చేయించడంతో విమర్శల పాలవుతున్నారు.

More Telugu News