dubai: అప్పుడుగానీ నాకు జాక్ పాట్ తగిలిన విషయం నమ్మలేదు: దుబాయ్ లోని ఎన్ఆర్ఐ హరి

  • దుబాయ్ లో బిజినెస్ డెవలపర్ గా సెటిలైన కేరళ వాసి హరి  
  • అతను కొనుగోలు చేసిన లాటరీ టికెట్ కు జాక్ పాట్
  • 12 లక్షల దిరామ్స్ సొంతం..మన కరెన్సీలో సుమారు 21 కోట్లు

దుబాయ్ లో నివసించే ఎన్ఆర్ఐ కు ఓ జాక్ పాట్ తగిలింది. ఈ విషయమై తనకు ఫోన్ వస్తే ఎవరో సరదాకు చెబుతున్నారని అనుకున్నానని, తీరా చూస్తే జాక్ పాట్ తగిలిన విషయం నిజమేనని కేరళలోని అలెప్పీకి చెందిన హరి కృషన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దుబాయ్ లో తాను బిజినెస్ డెవలపర్ గా సెటిలయ్యానని చెప్పారు. తనకు భార్య, కొడుకు ఉన్నారని తెలిపారు.

దుబాయ్ ఎయిర్ పోర్టులో ఇటీవల ఓ లాటరీ టికెట్ ను 500 దిరామ్స్ కు కొన్నానని, అయితే, ఆ సంగతి మర్చిపోయి తన పనుల్లో తాను పడిపోయానని అన్నారు. రెండు రోజుల క్రితం లాటరీ ఫలితాలు రాగా, తాను కొనుగోలు చేసిన టికెట్ నంబర్ కు 12 లక్షల దిరామ్స్ వచ్చాయని చెప్పారు. ఈ విషయమై ఓ వ్యక్తి తనకు ఫోన్ చేసి చెబితే తాను మొదట నమ్మలేదని, ఆ తర్వాత మీడియాలో పనిచేసే ఓ మిత్రుడు, ఆపై స్థానిక రేడియో స్టేషన్ నుంచి తనకు ఫోన్లు వచ్చాయని అన్నారు.

దీంతో, నమ్మకం కుదిరి సదరు లాటరీ కంపెనీ వెబ్ సైట్ ను చూడమని తన భార్యకు ఫోన్ చేసి చెప్పానని, జాక్ పాట్ తగిలిన విషయం నిజమేనని చెప్పిన తర్వాత నమ్మానని అన్నారు. గతంలో రెండు సార్లు లాటరీ టికెట్లు కొన్నప్పటికీ తనకు జాక్ పాట్ తగలలేదని, ఇప్పుడు అదృష్టం వరించిందని హరి సంతోషం వ్యక్తం చేశారు. కాగా, 12 లక్షల దిరామ్స్ విలువ మన కరెన్పీలో చెప్పాలంటే సుమారు 21 కోట్లు. 

More Telugu News