Pawan Kalyan: ఫుల్ టైమ్ పాలిటిక్స్ లోకి వెళ్లబోయే ముందు పవన్ ఓ మంచి సినిమా చేయాలి!: కత్తి మహేశ్

  • ‘అజ్ఞాతవాసి’ చాలా నిరుత్సాహపరిచింది
  • సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటలు బాగున్నాయి
  • ‘కొడకా కోటేశ్వరరావు’ తప్పా, మిగిలిన అన్ని పాటలు నాకు నచ్చాయి : ఓ ఇంటర్వ్యూలో కత్తి మహేశ్

ఫుల్ టైమ్ పాలిటిక్స్ లోకి పవన్ వెళ్లబోయే ముందు ఓ మంచి సినిమా చేయాలని తాను కోరుకుంటున్నానని ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేశ్ అన్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘అజ్ఞాతవాసి’ చిత్రం ఈరోజు విడుదలైంది. ఈ సినిమాను వీక్షించిన అనంతరం మోజో టీవీ ఛానెల్ కు కత్తి మహేశ్ ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఈ సందర్భంగా ‘అజ్ఞాతవాసి’ గురించి తాను విశ్లేషణ చేస్తున్న వీడియోను కత్తి మహేశ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘ఈ సినిమా చాలా నిరుత్సాహ పరిచింది. నిజానికి ఈ సినిమా టీజర్ చూసినప్పుడు ఇంప్రెస్ కాని వాడిని, ట్రైలర్ చూశాక ఏదో ఉంటుందని భావించా. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. సరదాగా పాడిన ‘కొడకా కోటేశ్వరరావు’ పాట తప్పా, మిగిలిన అన్ని పాటలు నాకు నచ్చాయి. ఆ పాటల్లో చాలా బలమైన అర్థాలు కనిపించాయి.

ఇక స్క్రీన్ పై ఈ సినిమాను ఎలా చూపించారనే పెద్ద ఆసక్తితో ఈ సినిమాకు వెళ్లా. అన్ని విషయాలను పక్కనబెట్టి ఈ సినిమాను సినిమాగా చూద్దామని వెళ్లాను. అయితే, త్రివిక్రమ్, పవన్ కల్యాణ్ ఇద్దరూ నిరుత్సాహపరిచారు. ఇటాలియన్ లేదా ఫ్రెంచ్ సినిమా కాపీ ఇదని అందరికీ తెలుసు. కథ మాత్రం అక్కడి నుంచే తీసుకున్నారు. సీరియస్ కథకు కామెడీ ట్రీట్ మెంచ్ ఇవ్వడంతో ఈ సినిమా అపహాస్యం పాలైపోయింది.

నాలుగుకామెడీ సీన్లు, చౌకబారు రొమాంటిక్ సీక్వెన్స్ కలిపి తెలుగు ప్రేక్షకులకు ఇది సరిపోతుందిలే అన్నట్టు ట్రీట్ మెంట్ ఇచ్చారు. ఇలా కావాలని చేయకపోవచ్చు! అయితే, కథకు న్యాయం చేయకపోగా నాశనం చేస్తే మాత్రం ఎవరూ ప్రశంసించరు’ అంటూ చెప్పుకొచ్చారు.

More Telugu News