iss: అంత‌రిక్షంలో 9 సెం.మీ.ల ఎత్తు పెరిగానంటూ వ్యోమ‌గామి త‌ప్పుడు ట్వీట్‌... క్ష‌మాప‌ణ‌లు కోరుతూ మ‌రో ట్వీట్‌

  • ఇటీవ‌ల ఐఎస్ఎస్‌కి వెళ్లిన జ‌పాన్ వ్యోమ‌గామి నొరిషిగే క‌నాయ్‌
  • ఎత్తు పెరిగిన‌ట్లు ట్వీట్ చేయ‌డంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా మీడియాలో క‌థ‌నాలు
  • స‌రిచూసుకుని మ‌రో ట్వీట్ ద్వారా క్ష‌మాప‌ణ‌లు కోరిన వైనం

జ‌పాన్‌కి చెందిన వ్యోమ‌గామి నొరిషిగే క‌నాయ్, అంత‌రిక్షంలో త‌న ఎత్తు గురించి ఓ త‌ప్పుడు ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ చేసినందుకు క్ష‌మాప‌ణ‌లు కోరుతూ మ‌రో ట్వీట్ చేశారు. ఆరు నెల‌ల మిష‌న్‌లో భాగంగా ఇటీవ‌ల నొరిషిగే క‌నాయ్ అంత‌ర్జాతీయ అంత‌రిక్ష కేంద్రం (ఐఎస్ఎస్‌)కి వెళ్లారు. అక్క‌డికి వెళ్లిన త‌ర్వాత త‌న ఎత్తు 9 సెం.మీ.లు పెరిగింద‌ని, మ‌ళ్లీ భూమికి తిరిగి వ‌చ్చేట‌ప్పుడు వాహ‌న నౌక‌లో తాను ఇమ‌డ‌క‌పోవ‌చ్చ‌ని ట్వీట్ చేశాడు.

ఈ ట్వీట్‌ను ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న మీడియా వివిధ క‌థ‌నాల రూపేణా రాసింది. సాధార‌ణంగా అంత‌రిక్షంలోకి వెళ్ల‌గానే అక్క‌డ గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం వల్ల వెన్నెముక కొద్దిగా సాగుతుంది. దీంతో వ్యోమ‌గామి ఎత్తులో పెరుగుద‌ల క‌నిపిస్తుంది. ఈ పెరుగుద‌ల 1 నుంచి 2 సెం.మీ.ల మ‌ధ్య మాత్ర‌మే ఉంటుంది. భూమి మీదకు రాగానే మళ్లీ యథాస్థితికి చేరుకుంటుంది. అయితే, నొరిషిగే క‌నాయ్ 9 సెం.మీ.లు పెరిగానని చెప్ప‌డం ఆశ్చ‌ర్య‌క‌రంగా ఉందంటూ వివిధ దేశాల్లోని మీడియా ప్ర‌చారం చేసింది.

మ‌రుస‌టి రోజు నొరిషిగే మ‌రో ట్వీట్ చేశాడు. ఇందులో త‌న‌ను క్ష‌మించాల‌ని ఆయ‌న కోరాడు. ఎత్తు 9 సెం.మీ.లు పెర‌గ‌లేద‌ని, మ‌రోసారి స‌రిచూసుకుంటే విష‌యం అర్థ‌మైంద‌ని, తాను రెండు సెంటీమీట‌ర్లే పెరిగిన‌ట్లుగా ధ్రువీక‌రించారు. త‌ప్పుడు ట్వీట్ చేసి న‌కిలీ వార్త‌ల ప్రచారానికి కార‌ణ‌మైనందుకు క్ష‌మించాల‌ని కోరారు.

More Telugu News