క్రిప్టోక‌రెన్సీ ఆవిష్క‌రించిన కొడాక్‌... ఒక్క‌సారిగా రెట్టింపైన షేర్ల విలువ‌

10-01-2018 Wed 12:35
  • కొడాక్ కాయిన్ పేరుతో వ‌ర్చువ‌ల్ కరెన్సీ
  • ఫొటోగ్రాఫ‌ర్ల‌కు ప్ర‌త్యేకం
  • బ్లాక్‌చెయిన్ మార్కెట్‌లోకి రంగ‌ప్ర‌వేశం
బిట్‌కాయిన్ అభివృద్ధితో వ‌ర్చువ‌ల్ క‌రెన్సీ వ్యాపారం పుంజుకుంది. దీంతో ప్ర‌ముఖ కంపెనీల‌న్నీ త‌మ బ్రాండ్‌కి త‌గిన‌ట్లుగా వ‌ర్చువ‌ల్ క‌రెన్సీని సృష్టిస్తున్నాయి. బ్లాక్‌చెయిన్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాం ద్వారా క్రిప్టోక‌రెన్సీ లావాదేవీల‌ను కొన‌సాగించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్ర‌ముఖ కంపెనీ కొడాక్ `కొడాక్ కాయిన్‌` పేరుతో వ‌ర్చువ‌ల్ క‌రెన్సీని తీసుకురాబోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. దీంతో మంగ‌ళ‌వారం రోజు ఆ కంపెనీ షేర్లు రెట్టింపు ధ‌ర ప‌లికాయి.

వెన్ డిజిట‌ల్‌తో క‌లిసి కొడాక్‌వ‌న్ పాల‌సీలో భాగంగా ఈ డిజిట‌ల్ క‌రెన్సీని విడుద‌ల చేయ‌నున్నారు. ఇది ఫొటోగ్రాఫ‌ర్ల‌కు ప్ర‌త్యేకం. ఫొటోల‌కు రాయ‌ల్టీని కూడా ఇదే క‌రెన్సీలో చెల్లించేందుకు కొడాక్ యోచిస్తోంది. ఓ వైపు బిట్‌కాయిన్ వంటి వ‌ర్చువ‌ల్ క‌రెన్సీ లావాదేవీలు అనూహ్య మార్పుల‌కు లోన‌యి న‌ష్టాలు తీసుకువ‌చ్చే అవ‌కాశముంద‌ని వార్త‌లు వ‌స్తున్న‌ప్ప‌టికీ, ఇలా రోజుకో ఎక్స్చేంజ్ పుట్టుకు వ‌స్తుండ‌టం వినియోగ‌దారుల‌ను ఆలోచ‌న‌లో ప‌డేస్తోంది.