imran khan: నేనేమైనా దేశ రహస్యాలను ఇండియాకు అమ్మానా?: నవాజ్ షరీఫ్ పై నిప్పులు చెరిగిన ఇమ్రాన్ ఖాన్

  • మూడో పెళ్లికి సిద్ధమైన ఇమ్రాన్
  • విమర్శనాత్మక కథనాలు రాస్తున్న షరీఫ్ మీడియా
  • షరీఫ్ పై మండిపడ్డ ఇమ్రాన్

బుస్రా మనేకా అనే మహిళను మూడో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైన తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పాకిస్థాన్ అధినేత ఇమ్రాన్ ఖాన్ పై అక్కడి మీడియా విమర్శనాత్మక కథనాలు రాస్తుండటంపై ఆయన మండిపడ్డారు. తానేమైనా ఇండియాకు దేశ రహస్యాలను అమ్మానా? లేక దేశ సంపదను మనీ లాండరింగ్ ద్వారా తరలించి మీడియా సంస్థను నెలకొల్పానా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పై ఆయన నిప్పులు చెరిగారు. షరీఫ్ కు చెందిన ఓ ప్రైవేట్ మీడియా సంస్థ ఇమ్రాన్ ను టార్గెట్ చేస్తూ పలు కథనాలను ప్రసారం చేస్తున్న నేపథ్యంలో, ఆయన స్పందించారు.

తనకు తన పిల్లలు, బుస్రా బేగమ్ కు చెందిన కుటుంబం చాలా ముఖ్యమని ఇమ్రాన్ ట్వీట్ చేశారు. నవాజ్ షరీఫ్, మీర్ షకీల్ ఉర్ రహ్మాన్ లకు చెందిన మీడియా రాసే పిచ్చి కూతలను తాను పట్టించుకోనని ఆయన చెప్పారు. జియో టెలివిజన్ నెట్ వర్క్ రహ్మాన్ కు చెందినది. నవాజ్, రహ్మాన్ ల మీడియా తప్పుడు వార్తలతో తాను మరింత బలపడ్డానని, వారిపై పోరాటానికి మరింత బలవంతంగా తయారయ్యానని ఇమ్రాన్ అన్నారు. గత 40 ఏళ్లుగా నవాజ్ షరీఫ్ తనకు తెలుసని... ఆయన అనైతిక జీవితం ఏమిటో తనకు బాగా తెలుసని చెప్పారు. అయితే ఆ వివరాలను వెల్లడించి, తన స్థాయిని తగ్గించుకోలేనని తెలిపారు.

తాను ఏ బ్యాంకును దోచుకోలేదని, దేశ సంపదను కొల్లగొట్టలేదని, ఇండియాకు రహస్యాలను వెల్లడించలేదని... అయినా కూడా తాను ఏదో పెద్ద నేరం చేసినట్టుగా చూపెడుతున్నారని ఇమ్రాన్ మండిపడ్డారు. కేవలం పెళ్లి మాత్రమే చేసుకోవాలనుకుంటున్నానని చెప్పారు. పనామా పేపర్లలో ఆరోపణలు ఎదుర్కున్న నవాజ్ కుటుంబసభ్యులు... అవినీతి కేసులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇదే కారణంగా షరీఫ్ ప్రధాని పదవిని కూడా కోల్పోయారు. 

More Telugu News