Hostel: గురుకుల విద్యార్థుల భోజనంలో పురుగులు, ఎలుక.. హడలిపోయిన విద్యార్థులు!

  • బగారా అన్నంలో ఎలుక ప్రత్యక్షం 
  • వాంతులు చేసుకున్న విద్యార్థులు
  • వార్డెన్‌ను హెచ్చరించిన తహసీల్దార్

గురుకుల పాఠశాల విద్యార్థులకు వడ్డించిన భోజనంలో పురుగులు, చనిపోయిన ఎలుక కనిపించడంతో విద్యార్థులు విస్తుపోయారు. సగం భోజనం చేశాక తెల్లటి పురుగులు కనిపించడంతో కొందరు వాంతులు చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగపల్లిలోని గురుకుల పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఉదయం బగారా అన్నం వడ్డించారు. తింటున్న విద్యార్థులకు పురుగులు, ఎలుక పిల్ల కనిపించాయి. దీంతో విద్యార్థులు హడలిపోయారు. కొందరు విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. ఏడో తరగతి చదువుతున్న అరుణ్ కుమార్ అస్వస్థతకు గురికావడంతో వెంటనే అతడిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు.

పురుగుల అన్నం విషయమై సమాచారం అందుకున్న తహసీల్దార్ పద్మావతి, అధికారులు వెంటనే పాఠశాలకు చేరుకున్నారు. విద్యార్థుల కోసం వండిన ఆహారాన్ని పరిశీలించారు. హాస్టల్ వార్డెన్ అశోక్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలకు వండే ఆహారంలో పురుగులు ఏంటని నిలదీశారు. మరోసారి ఇటువంటి ఘటనలు జరిగితే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కాగా, భోజనం చేసిన విద్యార్థులకు ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి  పీల్చుకున్నారు.  

More Telugu News