Andhra Pradesh: అందుకే, ఫుడ్ ఫెస్టివల్స్ కి ప్రాధాన్యమిస్తున్నాం: ఏపీ టూరిజం శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా

  • ఏపీ సచివాలయంలో అచ్చ తెలుగు వంటకాలు
  • రుచి చూసిన ముఖేష్ కుమార్ మీనా
  • రాగి సంకటి, వేరుశనగ పచ్చడి, బీట్ రూట్ పచ్చడి బాగున్నాయన్న అధికారి

ప్రజలు ఆంధ్ర వంటకాలను మరచిపోతున్నారని, మళ్లీ వాటిని రుచి చూపించేందుకే ఫుడ్ ఫెస్టివల్స్ కు ప్రాధాన్యత ఇస్తున్నామని ఏపీ టూరిజం శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అన్నారు. సచివాలయం 3వ బ్లాక్ లోని ఉద్యోగుల సహకార సంఘ ఫలహారశాలలో ఈరోజు మధ్యాహ్నం అచ్చ తెలుగు వంటకాలను ఆయన రుచి చూశారు. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఉప్పుటూరి మురళీ కృష్ణ, సహకార సంఘం అధ్యక్షుడు వంకాయల శ్రీనివాస్ ఆయన వెంట ఉన్నారు.

రాగి సంకటి, వేరుశనగ పచ్చడి, బీట్ రూట్ పచ్చడిని రుచి చూసి, వంటలు చాలా బాగున్నాయని, వంట చేసిన వారిని పిలిపించి మరీ ముఖేష్ కుమార్ మీనా అభినందించారు. రేపు ఏమి వంటకాలు చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. రేపు దంపుడు బియ్యం పలావ్, 11న మెంతి కూర టమాటా అన్నం, 12న బెల్లం పొంగల్, మసాల వడ వండుతున్నట్లు నిర్వాహకుడు మహేంద్ర  వివరించి చెప్పారు.

ఈ సందర్భంగా ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ, సచివాలయం క్యాంటిన్ లో ప్రతి రోజూ సాధారణంగా వడ్డించే భోజనంతోపాటు ఈ నాలుగు రోజులు అదనంగా ప్రత్యేక తెలుగు వంటకాలు వడ్డిస్తారని ఆయన చెప్పారు. జన్మభూమి సందర్భంగా ప్రతి జిల్లాలో, మండలాల్లో ఆంధ్ర వంటకాల ఎగ్జిబిషన్ లు ఏర్పాటు చేస్తున్నామని, తెలుగు వంటకాలు రుచి చూపిస్తూ ప్రచారం కల్పిస్తున్నట్లు చెప్పారు. అనంతరం, సచివాలయ ఉద్యోగులకు, విజిటర్స్ కు భోజనంలో రాగి సంకటి, పచ్చళ్లు వడ్డించారు.  

More Telugu News