China: అమెరికాపై చైనా చిర్రుబుర్రు.. పాక్‌ను వేలెత్తి చూపొద్దని హుకుం!

  • పాక్‌ను వెనకేసుకొచ్చిన చైనా
  • అమెరికా తీరుపై మండిపాటు
  • వేలెత్తి చూపడం మాని  సహకరించుకోవాలని పిలుపు

పాకిస్థాన్‌పై తనకున్న అభిమానాన్ని డ్రాగన్ కంట్రీ చైనా మరోమారు బయటపెట్టింది. ఉగ్రవాదాన్ని అణచడంలో విఫలమైందని ఆరోపిస్తూ గతవారం పాకిస్థాన్‌పై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా, ఆ దేశానికి భద్రతా సాయం కింద అందిస్తున్న 2 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని ఆపేస్తున్నట్టు ప్రకటించింది. అమెరికా తీరుపై స్పందించిన చైనా.. చీటికిమాటికి పాకిస్థాన్‌ను వేలెత్తి చూపడాన్ని మానుకోవాలని సూచించింది. ఇటువంటి చర్యలను చైనా ఎంతమాత్రమూ అంగీకరించబోదని తేల్చి చెప్పింది.

చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి లుకాంగ్ ఓ సమావేశంలో మాట్లాడుతూ.. ఉగ్రవాదం ఏ ఒక్క దేశానికో పరిమితం కాలేదని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని అణచివేసే విషయంలో ఒకరినొకరు వేలెత్తి చూపుకోవడం, తప్పులు వెతకడం మాని పరస్పరం సహకరించుకోవాలని పిలుపునిచ్చారు. గతంలోనూ పలుమార్లు ఇదే విషయాన్ని చెప్పామన్నారు. ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న ఉగ్రవాదం పీచమణచేందుకు పరస్పర సహాయసహకారాలు అవసరమని లుకాంగ్ పేర్కొన్నారు.

More Telugu News