China: సముద్రంలో రెండు నౌకలు ఢీ.. 32 మంది గల్లంతు

  • ప్రమాదంతో తగలబడిన నౌక
  • చమురు ఒలికిపోయి సముద్ర జలాలు కలుషితం
  • 9 నౌకలు, విమానం ద్వారా గాలింపు చర్యలు

రెండు నౌకలు ఢీకొన్న ఘటనలో 32 మంది గల్లంతయ్యారు. తూర్పు చైనా సముద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆయిల్ ట్యాంకర్-సరుకు రావాణా నౌక ప్రమాదవశాత్తు ఢీకొన్నాయి. గల్లంతైన వారిలో 30 మంది ఇరాన్ దేశస్తులు, ఇద్దరు బంగ్లాదేశీయులు ఉన్నారు. నేవీ అధికారుల కథనం ప్రకారం.. ఇరాన్ నుంచి 1.36 లక్షల టన్నుల ముడి చమురుతో వెళ్తున్న ‘సాంచీ’ అనే నౌక 64 వేల టన్నుల ధాన్యంతో అమెరికా నుంచి వస్తున్న ‘సీఎఫ్ క్రిస్టల్’ అనే సరుకు రవాణా నౌకను ఢీకొట్టింది. షాంఘైకి 160 నాటికల్  మైళ్ల దూరంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే చమురు రవాణా నౌకకు మంటలు అంటుకున్నాయి.

ఈ ఘటనలో మొత్తం 32 మంది సిబ్బంది గల్లంతవగా 21 మందిని సహాయక బృందాలు రక్షించాయి. ట్యాంకర్‌కు మంటలు అంటుకోవడంతో చమురు మొత్తం సముద్ర జలాల్లో కలిసి పోయింది. ఫలితంగా జలాలు కలుషితమైనట్టు చైనా రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా, గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు ఇంకా గాలిస్తూనే ఉన్నాయి. మొత్తం 8 నౌకలు గాలింపు చర్యలు చేపట్టాయి. మరోవైపు దక్షిణ కొరియా ఓ విమానం, ఓ నౌక ద్వారా గాలింపు చర్యలు చేపట్టింది.

More Telugu News