Harish Rao: బోగస్ అఫిడవిట్లు జారీ చేసిన అధికారులపై చర్యలు.. క్రిమినల్ కేసులు: మంత్రి హరీశ్ రావు

  • మిడ్ మానేరు పనులన్నీ ఫిబ్రవరి 15 లోగా పూర్తి
  • నిర్వాసితుల పునరావాస చర్యలు వేగవంతం చేయాలి
  • ఆర్అండ్ఆర్ పనులకు 65 కోట్లు విడుదల
  • మిడ్ మానేరు పనుల్లో అవకతవకలకు పాల్పడ్డ అధికారులపై హరీశ్ రావు సీరియస్

మిడ్ మానేరు ప్రాజెక్టు గేట్ల బిగింపు సహా సివిల్, మెకానికల్, సాంకేతిక పనులన్నీ ఫిబ్రవరి 15 లోపు పూర్తి చేయాలని తెలంగాణ భారీనీటి పారుద‌ల శాఖ మంత్రి హరీశ్‌ రావు ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులు ఊపందుకున్నందున మ‌రోవైపు మిడ్ మానేరు పూర్తి కావడం కూడా అత్యంత కీలకమని అన్నారు. ఈ రోజు హైద‌రాబాద్‌లోని జలసౌధలో మిడ్ మానేరు పనుల పురోగతి, భూ నిర్వాసితులకు నష్టపరిహారం, పునరావాస కార్యక్రమాలను ఆయన సమీక్షించారు.

ఈ సంద‌ర్భంగా హ‌రీశ్ రావు మాట్లాడుతూ... మిడ్ మానేరు భూనిర్వాసితుల నష్టపరిహారం కోసం తప్పుడు అఫిడవిట్లు సమర్పించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాంటి అఫిడవిట్లు జారీ చేసిన మండల అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని సూచించారు. నిర్వాసితులకు నష్ట పరిహారం చెల్లింపుల సందర్భంగా ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని హ‌రీశ్‌రావు అన్నారు. ప్రతి గ్రామంలోనూ ఫిజికల్ గా వెరిఫై చేయాలని కోరారు.

ముంపునకు గురయ్యే స్ట్రక్చర్ల అంచనాలు రూపొందించడంలో అవకతవకలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మిడ్ మానేరు స్పీల్ వే పనుల పురోగతిని మంత్రి తెలుసుకున్నారు. మొత్తం 25 గేట్ల ఫ్యాబ్రికేషన్ పనులు, బిగింపు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆయన కోరారు. రివిట్ మెంట్ పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నట్టు ఏజెన్సీ ప్రతినిధులు మంత్రికి తెలిపారు.

More Telugu News