Tirumala: సేవా టికెట్ల బుకింగ్ సమయాన్ని తగ్గించిన టీటీడీ!

  • ప్రస్తుతం లక్కీ డిప్ నమోదుకు వారం రోజుల వ్యవధి
  • నాలుగు రోజులకు తగ్గించిన టీటీడీ
  • ఏప్రిల్ సేవా టికెట్ల కోటా విడుదల

తిరుమల శ్రీ వెంకటేశ్వరుని సేవా టికెట్ల లక్కీ డిప్ బుకింగ్ సమయాన్ని వారం రోజుల నుంచి నాలుగు రోజులకు తగ్గిస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది. ప్రస్తుతం ప్రతి నెలా మొదటి శనివారం నాడు సేవా టికెట్లను విడుదల చేసి, ముఖ్యమైన సేవలకు సంబంధించిన టికెట్లను లక్కీ డిప్ ద్వారా భక్తులకు అందిస్తున్న సంగతి తెలిసిందే. లక్కీ డిప్ లో పేర్లను నమోదు చేసుకునేందుకు ప్రస్తుతం వారం రోజుల గడువును ఇస్తూ, రెండో శుక్రవారం నాడు టికెట్లు పొందిన వారి పేర్లను ప్రకటిస్తుండగా, ఈ సమయాన్ని నాలుగు రోజులకు తగ్గిస్తున్నామని ఈఓ అనిల్ సింఘాల్ శుక్రవారం నాడు వెల్లడించారు.

 ఏప్రిల్ నెలకు సంబంధించిన 56,593 టికెట్లను నేటి నుంచి అందుబాటులో ఉంచామని తెలిపిన ఆయన, వీటిల్లో 10,658 టికెట్లను లక్కీ డిప్ లో ఇస్తామని అన్నారు.  సుప్రభాతం 7,878, తోమాల సేవ 120, అర్చన 120, అష్టదళపాద పద్మారాధన 240, నిజపాద దర్శనం 2,300 టికెట్లను డిప్ ద్వారా అందిస్తామన్నారు. ఇవి కావాలంటే, సోమవారంలోగా పేర్లను నమోదు చేసుకోవాలని తెలిపారు. వీటితో పాటు విశేష పూజ 1,875, కల్యాణోత్సవం 11,250, ఊంజల్‌ సేవ 3,000, ఆర్జిత బ్రహ్మోత్సవం 5,805, వసంతోత్సవం 11,180, సహస్ర దీపాలంకరణ 12,825 టిక్కెట్లను విడుదల చేశామన్నారు.

More Telugu News