USA: అమెరికాను వదిలి కెనడావైపు హెచ్-1బీ వీసాదారుల పరుగులు!

  • వీసా నిబంధనలను కఠినం చేసిన అమెరికా
  • ట్రంప్ నిర్ణయం అమలైతే ఏడున్నర లక్షల మందిపై ప్రభావం
  • గ్రీన్ కార్డు కోసం వేచి చూస్తున్న పది లక్షల మంది
  • వారికి స్వర్గధామంలా కనిపిస్తున్న కెనడా
  • ఇప్పటికే వీసా నిబంధనలను సరళీకృతం చేసిన ట్రుడావో

గ్రీన్ కార్డుల జారీని కఠినం చేయాలని, హెచ్ 1-బీ వీసాల గడువును పొడిగించరాదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకున్న వేళ, ఆందోళనలో ఉన్న లక్షలాది మంది భారతీయ ఉద్యోగులకు ఇప్పుడు కెనడా ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. ట్రంప్ ప్రతిపాదనలు అమలులోకి వస్తే, దాదాపు ఐదు నుంచి ఏడున్నర లక్షల మంది తట్టా బుట్టా సర్దుకుని ఇండియాకు తిరుగు ప్రయాణం కట్టాల్సిందే. ఈ నేపథ్యంలో నైపుణ్యమున్న భారత నిపుణులను తమ దేశానికి ఆహ్వానించాలన్న ఉద్దేశంతో కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడావో కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు.

ట్రుడావో ఆలోచనలపై బ్లూమ్ బర్గ్ ఇటీవల "హైటెక్‌ వీసాలపై ట్రంప్‌ నిర్లక్ష్యం.. ట్రూడస్‌ స్వాగతం" పేరిట ఓ రిపోర్టును కూడా విడుదల చేసింది. విదేశీయుల నిబంధనలను సరళీకృతం చేయడంతో పాటు, వీసా కోసం దరఖాస్తు చేసుకున్న పది రోజుల్లోనే మంజూరు ప్రక్రియను పూర్తి చేయాలని కెనడా సర్కారు నిర్ణయం తీసుకుందని ప్రకటించింది. గత సంవత్సరం జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో 2 వేల మందికి వీసాలను జారీ చేసిందని, అమెరికాను వీడాలని భావించే వారికి ఇప్పుడు కెనడా స్వర్గధామంలా కనిపిస్తోందని పేర్కొంది.

ఇక యూఎస్ ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలు భారత ఉద్యోగులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయని ఈ నివేదిక అభిప్రాయపడింది. దాదాపు పదేళ్లుగా ఎంతో మంది ఇండియన్స్ గ్రీన్ కార్డులను పొందేందుకు వేచి చూస్తున్నారని, వారందరిపైనా ట్రంప్ నిర్ణయాలు ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయని, సుమారు 10 లక్షల మంది గ్రీన్ కార్డు కోసం వేచి చూస్తున్నారని వెల్లడించింది. ఇదిలావుండగా, గ్రీన్ కార్డు పొందలేని కొందరు ఇప్పుడు యూఎస్ ఆఫర్ చేసే ఈబీ-5 వీసా కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. 5 లక్షల డాలర్లను పెట్టుబడిగా పెట్టడంతో పాటు 10 మంది అమెరికన్లకు ఉద్యోగాలు ఇస్తే, గ్రీన్ కార్డుతో సమానమైన అవకాశాలు లభించే ఈబీ-5 వీసాను పొందవచ్చన్న సంగతి తెలిసిందే.

More Telugu News