Metro pillar: మెట్రో పిల్లర్ కూలిపోయిందంటూ వదంతులు.. టీవీల్లో బ్రేకింగ్ న్యూస్‌లు.. బెంగళూరులో కలకలం!

  • మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టిన ట్రక్కు
  • పిల్లర్ కూలిపోయిందంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్
  • అంతా ఉత్తిదేనన్న పోలీసులు

మెట్రో పిల్లర్ కూలిపోయిందంటూ వదంతులు వ్యాపించడంతో బెంగళూరు వాసులు తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు. నగరంలోని మైసూర్ రోడ్డులో ఓ పిల్లర్ కూలిపోయిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తాయి. పలు టీవీ చానళ్లు కూడా బ్రేకింగ్ న్యూస్‌తో ఈ విషయాన్ని హోరెత్తించాయి. దీంతో ప్రజలు పోలీసులకు, కంట్రోల్ రూములకు ఫోన్ల మీద ఫోన్లు చేశారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న  పోలీసులు ఆ వార్తలు అబద్ధమని తేల్చారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని, మెట్రో పిల్లర్‌కు ఎటువంటి నష్టం వాటిల్లలేదని పేర్కొన్నారు.

నగర శివారులోని నయందహళ్లిలో నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లరును ఓ ట్రక్కు ఢీకొట్టింది. దీంతో పిల్లర్‌ కొంత మేర దెబ్బతింది. ట్రక్కు డ్రైవర్ పరారయ్యాడు. అయితే వాస్తవాన్ని తెలుసుకోకుండానే కొందరు సోషల్ మీడియాలో విపరీత ప్రచారం చేశారు. పిల్లర్ కూలిపోయిందని పోస్టులు పెట్టారు. దీంతో క్షణాల్లోనే ఈ వార్త నగరమంతా పాకిపోయింది. దీంతో స్పందించిన పోలీసులు, మెట్రో అధికారులు అవి వదంతులు మాత్రమేనని, నమ్మవద్దని కోరారు.

More Telugu News