aadhaar: స్టోర్‌కి వెళ్ల‌కుండానే మొబైల్ నెంబ‌ర్‌తో ఆధార్ లింక్‌.. కొత్త సౌకర్యాన్నిచ్చిన ప్రభుత్వం!

  • కొత్త స‌దుపాయం ప్ర‌వేశ‌పెట్టిన ప్ర‌భుత్వం
  • 14546 నెంబ‌ర్‌కి కాల్ చేస్తే చాలు
  • వ‌న్ టైమ్ పాస్‌వ‌ర్డ్ ద్వారా లింకింగ్ పూర్తి

మొబైల్ నెంబ‌ర్‌ను ఆధార్‌తో లింక్ చేయాల‌ని ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసిన‌ప్ప‌టి నుంచి వినియోగ‌దారులు ఆయా మొబైల్ స‌ర్వీస్ స్టోర్ల ద‌గ్గ‌ర పెద్ద పెద్ద క్యూలు క‌ట్టారు. అంత క‌ష్ట‌ప‌డినప్ప‌టికీ కొన్ని సార్లు స‌ర్వ‌ర్ ప‌నిచేయ‌క‌పోవ‌డం కార‌ణంగా కొంత‌మంది వెనుదిరిగిన సంద‌ర్భాలు ఉన్నాయి. దీంతో మొబైల్ నెంబ‌ర్ అనుసంధాన గ‌డువును ప్ర‌భుత్వం పెంచుతూ వ‌చ్చింది. ఇటీవ‌ల మార్చి 31, 2018ని తుది గ‌డువుగా నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే.

అయితే మొబైల్ నంబ‌ర్ లింకింగ్‌ను మ‌రింత సుల‌భ‌త‌రం చేసేందుకు ప్ర‌భుత్వం కొత్త స‌దుపాయం ప్ర‌వేశ‌పెట్టింది. ఈ స‌దుపాయం ద్వారా స్టోర్ల‌కి వెళ్ల‌కుండానే ఆధార్‌ను అనుసంధానించే అవ‌కాశం క‌లుగుతోంది. 14546 టోల్ ఫ్రీ నెంబ‌ర్‌కి కాల్ చేసి ఇంట‌రాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్ట‌మ్ ద్వారా ఆధార్‌ను అనుసంధానం చేయ‌వ‌చ్చు. వ‌న్ టైమ్ పాస్‌వ‌ర్డ్ ద్వారా ఈ అనుసంధానం జ‌రుగుతుంది. ఆధార్ రీ-వెరిఫికేష‌న్‌లో భాగంగా ఈ స‌దుపాయాన్ని అందుబాటులోకి తీసుకువ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.

ఈ నెంబ‌ర్‌కి కాల్ చేయగానే... మీరు భార‌తీయులా? కాదా? అనే విష‌యాన్ని తెలియ‌జేయాల్సి ఉంటుంది. ఆ త‌ర్వాత మీ 12 అంకెల ఆధార్ సంఖ్య‌ను ఎంట‌ర్ చేయాలి. వెంట‌నే ఆధార్‌లో న‌మోదు చేసిన మొబైల్ నెంబ‌ర్‌కి ఒక వ‌న్ టైమ్ పాస్‌వ‌ర్డ్ వ‌స్తుంది. అందుకే ఆధార్‌తో న‌మోదు చేయించిన మొబైల్‌ని ద‌గ్గ‌ర పెట్టుకోవాలి. ఓటీపీ క‌న్‌ఫ‌ర్మ్ చేయ‌గానే అనుసంధానం పూర్త‌వుతుంది.

More Telugu News