Tiwan: తైవాన్ కోర్టు సంచలన తీర్పు.. పెంచి పెద్దవాడిని చేసినందుకు తల్లికి రూ.4.8 కోట్లు చెల్లించాలని కుమారులకు ఆదేశం!

  • 20 ఏళ్ల క్రితం తల్లితో ఒప్పందం చేసుకున్న కుమారులు
  • వృద్ధురాలు కావడంతో తల్లిని పట్టించుకోని వైనం
  • కింది కోర్టు తీర్పును సమర్ధించిన సుప్రీంకోర్టు
  • డబ్బులు చెల్లించాల్సిందేనని ఆదేశం

తైవాన్ అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు చెప్పింది. కుమారుడిని పెంచి, పెద్దచేసి, విద్యాబుద్ధులు నేర్పినందుకు గాను తైవాన్ కరెన్సీలో 22.33 మిలియన్లు (రూ.4.8 కోట్లు) చెల్లించాలని ఆదేశించింది. ఈ మేరకు కింది కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించింది.

లో అనే మహిళ 1990లో తన భర్తతో విడాకులు తీసుకుంది. అనంతరం తన ఇద్దరు కుమారులను పెంచి పెద్ద చేసింది. అయితే ఆమె వృద్ధురాలయ్యాక కొడుకులు ఇద్దరూ ఆమెను పట్టించుకోవడం మానేశారు. అయితే కుమారుల వయసు 20 ఏళ్లు ఉన్నప్పుడు తల్లితో వారు ఓ ఒప్పందం కుదుర్చుకున్నారు. తమ ఆదాయంలో 60 శాతాన్ని తల్లికి ఇస్తామని పత్రాలు రాసుకున్నారు.

ఒప్పందం కుదుర్చుకుని తర్వాత మర్చిపోయిన కుమారులకు తల్లి పలుమార్లు గుర్తు చేసింది. అయితే తమను ఇబ్బందులకు గురిచేయవద్దంటూ వారి గాళ్‌ఫ్రెండ్స్ లాయర్ల ద్వారా తల్లికి నోటీసులు పంపించారు. దీంతో ‘లో’ ఎనిమిదేళ్ల క్రితం కోర్టును ఆశ్రయించింది. కుమారులిద్దరి నుంచి చెరో 5 మిలియన్ తైవాన్ డాలర్లను ఇప్పించాల్సిందిగా కోరింది.

కేసును విచారించిన కింది కోర్టు ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం డబ్బులు చెల్లించాల్సిందేనని తీర్పు చెప్పింది. అయితే కుమారులను పెంచడం తల్లి బాధ్యత అని, దానిని ఆర్థిక పరమైన అంశంగా చూడకూడదంటూ వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బుధవారం కేసును విచారించిన న్యాయస్థానం కింది కోర్టు తీర్పును సమర్థించింది.  తల్లికి రూ.4.8 కోట్లు చెల్లించాల్సిందిగా ఆదేశించింది. ఇద్దరూ చెల్లించగలిగే స్థితిలోనే ఉన్నారు కాబ్టటి ఇచ్చి తీరాల్సిందేనని స్పష్టం చేసింది.

More Telugu News