Stalin: తన తండ్రి వద్ద రజనీ ఆశీర్వాదం తీసుకోవడంపై స్టాలిన్ మండిపాటు!

  • కరుణానిధి ఆశీర్వాదం తీసుకున్న రజనీకాంత్
  • ద్రవిడ సిద్ధాంతాలను కనుమరుగు చేయాలని చూస్తున్నారు
  • ఎవరికి ఓటు వేయాలో ప్రజలకు తెలుసు
  • డీఎంకే నేత స్టాలిన్

త్వరలో రాజకీయ పార్టీ పెట్టాలని భావిస్తున్న దక్షిణాది సూపర్ స్టార్, తమిళ తలైవా రజనీకాంత్, స్వయంగా డీఎంకే అధినేత కరుణానిధి వద్దకు వచ్చి ఆశీర్వాదం తీసుకోవడంపై ఆయన కుమారుడు స్టాలిన్ మండిపడ్డారు. తమిళనాడులో ద్రవిడ సిద్ధాంతాలను కనుమరుగు చేయాలని కొందరు ప్రయత్నిస్తున్నారని, వారి ఆటలు సాగవని హెచ్చరించారు.

 తమిళ ప్రజల్లో ద్రవిడ వేదాంతం వేళ్లూనుకుపోయిందని, దాన్ని తొలగించే శక్తి భవిష్యత్ తరాలకు కూడా లేదని అన్నారు. ద్రవిడ సిద్ధాంతంపై రజనీకాంత్ కు నమ్మకం లేదన్నట్టుగా వ్యాఖ్యానించిన స్టాలిన్, ఎవరికి ఓటు వేయాలో, ఎవరికి ఓటు వేయకూడదో తమిళ ప్రజలకు తెలుసునని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో జరిగే ఎన్నికలు భారత్ ను ఏలుతున్న ఆర్యులకు, తమ ఉనికి కోసం శ్రమిస్తున్న ద్రవిడులకు మధ్య జరిగే పోరాటంగా ఆయన అభివర్ణించారు. కొత్త పార్టీలు పెడుతున్న వారి వెనుక బీజేపీ హస్తముందని, రాష్ట్రంలో వారి ఆలోచనలు సాగవని త్వరలోనే నిరూపణ అవుతుందని అన్నారు. కాగా, తనను ఆశీర్వదించాలని రజనీకాంత్ స్వయంగా వెళ్లి కరుణానిధిని కలిసిన గంటల వ్యవధిలో స్టాలిన్ ఈ ఆరోపణలు చేయడం గమనార్హం. 

More Telugu News