Rail: రైలు ప్రయాణికులకు ఊరట.. టికెట్ల బుకింగ్‌కు ఆధార్ తప్పనిసరి కాదన్న మంత్రి

  • ప్రయాణికులకు ఊరటనిచ్చే ప్రకటన చేసిన మంత్రి
  • టికెట్ బుకింగ్ సమయంలో ఆధార్ సమర్పణ ఐచ్ఛికమేనని వెల్లడి
  • రాయితీ టికెట్లకు మాత్రం తప్పనిసరి అన్న స్పష్టీకరణ

టికెట్ల బుకింగ్ సమయంలో ఆధార్ తప్పనిసరి కాదని రైల్వే శాఖ సహాయ మంత్రి రాజెన్ గోహైన్ తెలిపారు. లోక్‌సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఆయనీ ప్రకటన చేశారు. టికెట్ల బుకింగ్ సమయంలో ఆధార్ సమర్పణ ఐచ్ఛికమేనని, దీనిని తప్పనిసరి చేసే ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేశారు. అయితే రాయితీపై వృద్ధులకు జారీ చేస్తున్న టికెట్లకు మాత్రం ఆధార్ సమర్పించడాన్ని గతేడాది జనవరిలో ప్రవేశపెట్టినట్టు తెలిపారు. అంతే తప్ప మిగతా వారు టికెట్ల బుకింగ్ సమయంలో వారి ఇష్ట పూర్వకంగానే ఆధార్ సమర్పించవచ్చని వివరించారు.

మంత్రి ప్రకటన అలా ఉంటే క్షేత్రస్థాయిలో మాత్రం మరోలా ఉంది. ఆధార్ కార్డు ఉంటేనే టికెట్ల బుకింగ్‌కు అనుమతిస్తున్నారు. అలాగే ప్రయాణాల సమయంలోనూ ఆధార్‌ను దగ్గర పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విషయాన్ని లోక్‌సభలో సభ్యుడు లేవనెత్తారు. అయితే మంత్రి మాత్రం అటువంటిదేమీ లేదని, ఆధార్ ఐచ్ఛికమేనని తేల్చి చెప్పారు.

More Telugu News