Harish Rao: రాబోయే ఎనిమిది నెలలు కీలకం: మంత్రి హరీశ్ రావు

  • తెలంగాణ గోస తీర్చాలి
  • కేసీఆర్ నమ్మకాన్ని నిలబెట్టాలి
  • నీటి పారుదల ప్రాజెక్టుల్లో నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలి
  • లక్షలాది మంది రైతుల జీవితాల్లో వెలుగు నింపుతున్నాం 

రాబోయే ఎనిమిది నెలల కాలం ఇరిగేషన్ శాఖకు అత్యంత కీలకమని తెలంగాణ మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రతి గంట విలువైనదని, నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని అధికారులకు చెప్పారు. హైదరాబాద్‌లోని జలసౌధలో తెలంగాణ నీటిపారుదల శాఖ 2018 క్యాలెండర్‌ను ఆవిష్కరించిన హరీశ్ రావు అనంతరం మాట్లాడుతూ... పదహారు నెలల్లో చేయవలసిన పనులను ఎనిమిది నెలల్లో చేయడానికి ఇరిగేషన్ అధికార యంత్రాంగం నడుం బిగించాలని కోరారు.

గడచిన మూడున్నరేళ్లుగా అంకితభావంతో పనిచేస్తున్న ఇంజనీర్లు ఈ ఏడాది ఇంకా పట్టుదలతో పని చేయాలని హరీశ్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే సాగునీళ్లొస్తాయని, ప్రాజెక్టులు పూర్తవుతాయని ప్రజలు భావించారని అన్నారు. ప్రజల్ని, రైతులను నిరాశకు గురి చేయొద్దని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టవలసిన బాధ్యత ప్రతి ఇంజనీరుకు ఉందని అన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై సంపూర్ణంగా అవగాహన ఉన్న సీఎం దేశంలో కేసీఆర్ తప్ప మరెవరూ లేరని మంత్రి అన్నారు.

భవిష్యత్తులో కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టులను నిర్మించే అవసరం, అవకాశం రాదనీ కాళేశ్వరం ప్రాజెక్టులో పనులు జరుగుతున్న వేగాన్ని స్ఫూర్తిగా తీసుకొని మిగతా ప్రాజెక్టులలోనూ వేగవంతం చేయాలని హరీశ్ రావు సూచించారు. లక్షలాది మంది రైతుల జీవితాల్లో వెలుగు నింపే జల సంకల్పంలో భాగస్వాములైనందుకు ప్రస్తుత ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లంతా గర్వపడాలని అభిప్రాయపడ్డారు. ఈ ఎనిమిది మాసాలు వీలైనంత వరకు సెలవులు, పండుగదినాల వంటి రోజుల్లోనూ పని చేసి జిల్లాల వారీగా, ప్రాజెక్టుల వారీగా టార్గెట్లను పూర్తి చేయాలని ఇంజనీర్లకు మంత్రి విజ్ఞప్తి చేశారు.

ఇరిగేషన్, రెవెన్యూ, అటవీ శాఖల అధికారులు సమష్టిగా, సమన్వయంతో పని చేయడం వల్ల కాళేశ్వరం ప్రాజెక్టులో భూసేకరణ ప్రక్రియ పూర్తయిందని, అటవీ సంబంధిత సమస్యలు పరిష్కారమయ్యాయని చెప్పారు. 8 వేల ఎకరాల భూసేకరణ జరిగిందని గుర్తు చేశారు. 16 జిల్లాల్లో కాళేశ్వరంపై ప్రజాభిప్రాయసేకరణ సజావుగా సాగిందన్నారు. సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సి.డి.ఒ) విభాగం సిబ్బంది రేయింబవళ్లు డిజైన్ల రూపకల్పనలో పని చేశారని హరీశ్ రావు ప్రశంసించారు. సెలవులు, పండుగల సమయాల్లో కూడా పనిచేయడం వల్ల అనుకున్న సమయానికి డిజైన్లు పూర్తి చేయగలిగినట్టు మంత్రి చెప్పారు.     

More Telugu News