Uttar Pradesh: యోగి సర్కారు మరో సంచలన నిర్ణయం.. మదర్సాలకు ముస్లిం హాలిడేస్ కట్!

  • మదర్సా క్యాలెండర్‌లో ఏడు కొత్త సెలవు దినాలను చేర్చిన యోగి సర్కార్
  • ముస్లిం సెలవు దినాలను నాలుగుకు తగ్గించిన వైనం
  • ప్రభుత్వ తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు
  • మదర్సాలు పూర్తిగా మతపరమైనవంటున్న ముస్లిం మతపెద్దలు

ఉత్తరప్రదేశ్‌లోని యోగి సర్కారు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. స్వాతంత్ర్య దినోత్సవం నాడు మదర్సాల్లో జాతీయ గీతాన్ని ఆలపించడంతోపాటు దానిని వీడియో తీయడాన్ని ఇప్పటికే తప్పనిసరి చేసిన ప్రభుత్వం తాజాగా మంగళవారం మరో ఆదేశం జారీ చేసింది. ఇకపై మదర్సాలలో ముస్లిం సెలవు రోజులను గణనీయంగా తగ్గిస్తూ క్యాలెండర్ విడుదల చేసింది. ముస్లిం పండుగల సెలవు దినాలను తగ్గించడంతోపాటు ఇతర మతాల పండుగల వేళ మదర్సాలను మూసివేయడాన్ని తప్పనిసరి చేసింది.
 
ప్రభుత్వ తాజా నిర్ణయంపై ముస్లిం మతపెద్దలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. యూపీలో సాధారణంగా ముస్లిం పండుగలతోపాటు హోలీ, అంబేద్కర్ జయంతి నాడు మాత్రమే మదర్సాలను మూసివేస్తారు. అయితే ఇకపై మహావీర్ జయంతి, బుద్ధ పూర్ణిమ, రక్షాబంధన్, మహర్నవమి, దీపావళి, దసరా, క్రిస్మస్‌లకు కూడా మదర్సాలను మూసివేయాలని ఆదేశాలు జరీ చేసింది.

ఈదుల్ జుహా, ముహర్రం వంటి పండుగల సెలవు రోజులను నాలుగు రోజులకు తగ్గించడంతోపాటు కొత్తగా ఏడు సెలవు దినాలను చేర్చారు. ప్రభుత్వ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాల్సిందేనని యూపీ మదర్సా బోర్డు రిజిస్ట్రార్ రాహుల్ గుప్తా పేర్కొన్నారు. గొప్ప వ్యక్తుల జయంతిని జరుపుకోవడం వల్ల విద్యార్థులకు వారు ఎవరనే విషయం తెలుస్తుందని అన్నారు.

మదర్సాలు, మతపెద్దలు ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇస్లామిక్ మదర్సా మోడరనైజేషన్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఐజాజ్ అహ్మద్ మాట్లాడుతూ మదర్సాలు అనేవి పూర్తిగా మతపరమైన సంస్థలని, వాటిని ప్రత్యేకంగా పరిగణించాలి తప్పితే ఇలా అర్థం లేని ఆదేశాలు రుద్దడం సరికాదన్నారు. కొత్త సెలవు దినాలను చేర్చడంలో తప్పులేదు కానీ, విచక్షణతో వాడుకునే పది ప్రత్యేక సెలవు దినాలను తగ్గించడంపైనే తాము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు.

More Telugu News