Mumbai: కుల ఘర్షణలతో అట్టుడుకుతున్న ముంబై.. చిచ్చుపెట్టిన 200 ఏళ్లనాటి యుద్ధం.. నేడు రాష్ట్ర బంద్!

  • 200 ఏళ్లనాడు పేష్వా బాజీరావు-ఈస్టిండియా కంపెనీ మధ్య యుద్ధం
  • మరణించిన దళితుల స్మారకార్థం స్తూపం నిర్మాణం
  • 200వ వార్షికోత్సవానికి తరలివచ్చిన లక్షమంది దళితులు
  • రాళ్లదాడితో రేకెత్తిన ఘర్షణలు.. అట్టుడుకుతున్న ముంబై

ముంబై మహానగరం ఇప్పుడు అల్లర్లతో అట్టుడుకుతోంది. ఎప్పుడో 200 ఏళ్లనాడు జరిగిన యుద్ధం తాజా ఘర్షణలకు కారణమైంది. 200 ఏళ్ల క్రితం ఆంగ్లో-మరాఠా వార్ జరిగింది. పేష్వా బాజీరావు-2 సైన్యానికి, ఈస్టిండియా కంపెనీకి చెందిన చిన్న సైన్యానికి మధ్య యుద్ధం జరిగింది. ఈస్టిండియా కంపెనీ సైన్యంలో ఎక్కువమంది దళితులే ఉండేవారు.

ఆ యుద్ధంలో మరణించిన వారిలో ఎక్కువమంది దళితులే. దీంతో వారి స్మారకార్థం సన్సవాడి గ్రామంలో బ్రిటిష్ వారు ‘విజయ స్తూపం’ నిర్మించారు. జనవరి 1న ఈ స్తూపం వద్ద 200వ వార్షికోత్సవం నిర్వహించారు. లక్ష మంది దళితులు స్మారక స్తూపం వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో వారిపై రాళ్ల దాడి జరిగింది. ఒకరు మరణించగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. తాజాగా మరొకరు మరణించినట్టు తెలుస్తోంది. ఈ దాడితో ముంబై అట్టుడికింది. బుధవారం మహారాష్ట్ర బంద్‌కు దళిత సంఘాలు పిలుపునిచ్చాయి.

పేష్వా బాజీరావు-బ్రిటిషర్లకు మధ్య జరిగిన యుద్ధంలో ఆంగ్లేయులే విజయం సాధించినప్పటికీ మరణించిన వారిలో దళితులే ఎక్కువ కాబట్టి వారి స్మారకార్థం స్తూపం ఏర్పాటు చేశారు. దీనికి గుర్తుగా దళితులు ప్రతి ఏటా ఉత్సవాలు జరుపుకుంటున్నారు. అయితే ఇది బ్రిటిష్ వాళ్ల విజయం కావడంతో అతివాద సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

మరోవైపు లక్షలాదిగా తరలివచ్చిన వారిపై దుండగులు రాళ్లు రువ్వడంతోపాటు వాహనాలకు నిప్పుపెట్టారు. దీంతో ఇది కాస్తా, కుల ఘర్షణలకు దారితీసి, ముంబైకి పాకింది. మంగళవారం ఉదయమే రోడ్లపైకి చేరుకున్న ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. దీంతో లోకల్ రైళ్లు సహా పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఘర్షణలను అదుపు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందంటూ అంబేద్కర్ మనవడు, భరిపా బహుజన్ మహాసంఘ్ నేత ప్రకాశ్ అంబేద్కర్ ఆరోపించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా బుధవారం రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చారు.

More Telugu News