Hafeez Saeed: ఉగ్రవాది హఫీజ్ సయీద్‌ ఆటకట్టు.. భారీ షాకిచ్చేందుకు సిద్ధమైన పాక్!

  • హఫీజ్ ఆస్తులు, చారిటీల స్వాధీనానికి ‘యాక్షన్ ప్లాన్’
  • విరాళాల సేకరణపై నిషేధం
  • హఫీజ్ ఉగ్ర సంస్థలపైనా బ్యాన్
  • సయీద్‌పై తొలిసారి భారీ చర్యలు

అంతర్జాతీయ ఉగ్రవాది, ముంబై బాంబు పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్‌కు పాక్ భారీ షాకిచ్చింది. అతడి ఆధ్వర్యంలో నడుస్తున్న చారిటీలు విరాళాలు సేకరించకుండా నిషేధం విధించింది. ఈ మేరకు సెక్యూరిటీస్ అండర్ ఎక్స్ఛేంజి  కమిషన్ ఆఫ్ పాకిస్థాన్ (ఎస్ఈసీపీ) ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంతో ఉగ్రవాది ఆధ్వర్యంలో నడుస్తున్న జమాత్-ఉద్-దవా(జేయూడీ), లష్కరే తాయిబా (ఎల్‌ఈటీ), ఫలాహ్-ఇ-ఇన్సానియత్ ఫౌండేషన్ (ఎఫ్ఐఎఫ్)‌లకు ఎదురు దెబ్బ తగిలినట్టు అయింది. అలాగే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆంక్షల జాబితాలో ఉన్న జేయూడీ, లష్కరే తాయిబాతోపాటు మరో రెండు సంస్థలపై నిషేధం విధించింది.

తాము చేస్తున్న సాయాన్ని పాక్ ఉగ్రవాదం కోసం ఉపయోగించుకుంటోందంటూ తాజాగా అమెరికా అధ్యక్షుడు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో పాక్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తాజా నిర్ణయాన్ని అమెరికాకు తెలియజేస్తూ చల్లబరిచే ప్రయత్నం చేసింది. జేయూడీ విస్తరించకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.  

సయీద్ నెట్‌వర్క్‌పై ఈ స్థాయిలో చర్యలు తీసుకోవడం ఇదే తొలిసారి. సయీద్ నెట్‌వర్క్ కింద సెమినరీలు, స్కూళ్లు, ఆసుపత్రులు, ఓ పబ్లిషింగ్ హౌస్, అంబులెన్స్ సర్వీసులు నడుస్తున్నాయి. జేయూడీ, ఎఫ్ఐఎఫ్‌కు 50 వేల మంది వలంటీర్లు, వందలాదిమంది పెయిడ్ వర్కర్లు ఉన్నారు. డిసెంబరు 19న ప్రభుత్వం ఉన్నత స్థాయి అధికారులతో నిర్వహించిన సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. 

More Telugu News