SBI: కొత్త ఏడాది తొలి రోజున ఖాతాదారులకు శుభవార్త చెప్పిన ఎస్‌బీఐ

  • 30 బేస్ పాయింట్లను తగ్గించిన ఎస్‌బీఐ
  • గణనీయంగా తగ్గనున్న వడ్డీ రేట్లు
  • 80 లక్షల మందికి లబ్ధి

నూతన సంవత్సరం తొలి రోజున తమ ఖాతాదారులకు భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్‌బీఐ) శుభవార్త చెప్పింది. బేస్ పాయింట్లను 0.3 శాతం (30 బేస్ పాయింట్లు) తగ్గించింది. ఫలితంగా 8.95 శాతం ఉన్న బేస్ రేట్ 8.65 శాతానికి చేరుకుంది. ప్రామాణిక కనీస వడ్డీ రేట్ల(బిపిఎల్‌ఆర్‌) 13.70 శాతం నుంచి 13.40 శాతానికి తగ్గింది. ఫలితంగా రుణాలపై వడ్డీ రేటు గణనీయంగా తగ్గనుంది. ఎస్‌బీఐ నిర్ణయంతో పాత బేస్ రేట్ ప్రకారం రుణాలు తీసుకున్న 80 లక్షల మంది ఖాతాదారులకు లబ్ధి చేకూరనుంది. ముఖ్యంగా రిటైల్ వ్యాపారులు, గృహ రుణాలు తీసుకున్న వారు, విద్యార్థులకు పెద్ద ఊరట లభించినట్టు అయింది.

ఎస్‌బీఐ తాజా నిర్ణయం సోమవారం నుంచే అమల్లోకి వచ్చింది. బేస్ పాయింట్లు తగ్గించినప్పటికీ అదనపు నిధుల సమీకరణ ఖర్చుల ఆధారంగా మంజూరు చేసే రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటు (ఎంసీఎల్ఆర్) ను మాత్రం 7.95 శాతం వద్ద అలాగే ఉంచింది.

కొత్తగా గృహ రుణాలు తీసుకునే వారికి, ఇతర బ్యాంకుల నుంచి గృహ రుణాలను ఎస్‌బీఐకి మార్చుకునే వారికి ఇచ్చే ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు గడువును మార్చి వరకు పొడిగించింది. కాగా, ఎస్‌బీఐ తాజా నిర్ణయంతో ఇతర బ్యాంకులు కూడా బేస్ పాయింట్లను తగ్గించనున్నట్టు తెలుస్తోంది. 

More Telugu News