sambasiva rao: 33 ఏళ్లలో ఎవర్నీ, ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు: సాంబశివరావు

  • పదవీ విరమణ చేసిన సాంబశివరావు
  • చంద్రబాబు నమ్మకాన్ని కాపాడుకున్నానన్న సాంబశివరావు
  • వ్యాస్, ఉమేష్ చంద్రలు చేసిన త్యాగాలు మరిచిపోలేనివి

ఏపీ డీజీపీ సాంబశివరావు పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో మాలకొండయ్య బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో సాంబశివరావు ప్రసంగిస్తూ పలు విషయాలను నెమరు వేసుకున్నారు. ఐపీఎస్ అధికారిగా తన 33 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నానని చెప్పారు. విధి నిర్వహణలో ఏ రోజూ, ఎవర్నీ ఇబ్బంది పెట్టలేదని తెలిపారు. తొలిసారి బెల్లంకొండలో ఏఎస్పీగా విధుల్లో చేరానని చెప్పారు. వ్యాస్, ఉమేష్ చంద్రలు చేసిన త్యాగాలు మరువలేనివని అన్నారు. తీవ్రవాద సమస్య తీవ్రంగా ఉన్న సమయంలో ఎంతో మంది పోలీసులు తమ ప్రాణాలను పణంగా పెట్టారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తనపై ఉంచిన నమ్మకాన్ని కాపాడుకున్నానని అన్నారు. చంద్రబాబుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు.

రాష్ట్ర విభజన తర్వాత బాధ్యత మరింత పెరిగిందని సాంబశివరావు చెప్పారు. పదవికి తాను అలంకారమే కానీ, తనకు పదవి అలంకారం కాదని తెలిపారు. తనకు చదువు నేర్పించిన గురువులకు పాదాభివందనాలు సమర్పిస్తున్నానని చెప్పారు. పాఠశాల విద్యను అభ్యసించే రోజుల్లో తన గురువు రామకృష్ణ తనను ఎంతో ప్రోత్సహించారని... ఆయన వల్లే తనలో దాగున్న ప్రతిభను గుర్తించగలిగానని తెలిపారు. డీజీపీగా బాధ్యతలు స్వీకరిస్తున్న మాలకొండయ్య ఎంతో నిబద్ధత గలిగిన అధికారి అంటూ కొనియాడారు. 

More Telugu News