shares: షేర్లపై లాభాలకు కేంద్రం గండికొడుతుందా...? దీర్ఘకాల లాభాలపై పన్ను వేస్తుందా..?

  • పన్ను వేసేందుకు కేంద్రం యోచిస్తోందంటూ ప్రచారం
  • 2005లో ఈ పన్నును రద్దు చేసిన నాటి సర్కారు
  • ప్రస్తుతం చాలా దేశాల్లో ఇది అమల్లో ఉన్నదే

షేర్లలో పెట్టుబడుల ద్వారా వచ్చే లాభాలపై కేంద్ర ప్రభుత్వం మరోసారి పన్ను వేస్తుందా? ఈ అంశం మరోసారి చర్చకు వస్తోంది. షేర్లు కొని ఏడాదిలోపు విక్రయిస్తే వచ్చిన లాభాలపై 15 శాతం పన్ను చెల్లించడం (షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్) ప్రస్తుతం అమల్లో ఉంది. ఏడాదికి పైగా పెట్టుబడులు కొనసాగించి ఆ తర్వాత విక్రయించిన సమయంలో ఎంత లాభం వచ్చినా పన్ను లేదు. దీన్నే దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నుగా పేర్కొంటుంటారు. 2005 వరకూ ఇది అమల్లో ఉంది. అప్పట్లో యూపీఏ సర్కారు దీన్ని రద్దు చేసింది. కేవలం స్వల్ప కాలిక మూలధన లాభాల పన్నునే కొనసాగించింది. అయితే, దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నును తిరిగి ప్రవేశపెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నట్టు తాజాగా మరోసారి వార్తలు వస్తున్నాయి.

ఫైనాన్షియల్ మార్కెట్ల నుంచి లాభాలు పొందే వారు తప్పనిసరిగా పన్నుల ద్వారా జాతి నిర్మాణం కోసం తగినంత అందించాలని ప్రధాని మోదీ 2016 అక్టోబర్ 24న చేసిన ప్రసంగంతో ఈ ప్రచారానికి తొలుత బీజం పడింది. అప్పట్లో స్టాక్ మార్కెట్లు కూడా ప్రతికూలంగా స్పందించాయి. విదేశీ ఇన్వెస్టర్లలోనూ కలవరానికి దారితీసింది. దీంతో మోదీ సర్కారు దాన్ని పక్కన పెట్టినట్టు భావిస్తున్నారు.

2005 లో కేల్కర్ కమిటీ సిఫారసుల ఆధారంగా దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నును ఎత్తేయడం జరిగింది. ఎందుకంటే, దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను అంటే... అవి కంపెనీల లభాలు పెరగడం ద్వారా షేర్ల వృద్ధి, డివిడెండ్ల రూపంలో అందుకునేవే. వీటిపై అప్పటికే కంపెనీలు పన్ను చెల్లించి ఉంటాయిు. కనుక మూలధన లాభాలు అన్నవి అప్పటికే పన్ను చెల్లించినవి కావడంతో మళ్లీ పన్ను వేయడం సమంజసం కాదన్న సూచనతో అప్పట్లో దాన్ని రద్దు చేశారు.

వాస్తవానికి అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, అన్ని ప్రముఖ యూరోపియన్ దేశాలు అన్ని రకాల మూలధన లాభాలపై పన్ను వేస్తున్నాయి. కొన్ని దేశాలు భారీగా పన్ను రాబడుతున్నాయి కూడా. అన్ని అభివృద్ధి చెందిన దేశాల తరహాలోనే ఇక్కడా పన్ను వేయాలన్నది మోదీ సర్కారు ఆలోచన.

More Telugu News