gold prices: 2018లో బంగారం మెరుస్తుందా...? విశ్లేషకులు ఏమంటున్నారు?

  • ప్రపంచ ఆర్థిక వృద్ధి, డాలర్ గమనం కీలకం
  • వృద్ధి బాగుంటే ఈక్విటీలదే హవా
  • బంగారం పెద్దగా పెరిగేందుకు అవకాశాల్లేవు

క్రిప్టోకరెన్సీల దెబ్బకు బంగారం వెలవెలబోతోంది. అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం సమయంలో శిఖర స్థాయులకు చేరిన బంగారం ధర ఆ తర్వాత పెద్దగా పెరిగింది లేదు. ఈ మధ్యకాలంలో బిట్ కాయిన్ తదితర క్రిప్టోకరెన్సీల వైపు పెట్టుబడులు మళ్లుతున్నాయి. దీంతో బంగారం ధరలు అక్కడక్కడే చలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విశ్లేషకులు 2018లో బంగారం ప్రయాణంపై ఏమంటున్నారో చూద్దాం.

2017లో బంగారం ధరలు మొత్తం మీద 12.5 శాతం పెరిగాయి. ఒక విధంగా సంప్రదాయ బ్యాంకు డిపాజిట్లు, డెట్ పథకాలతో పోలిస్తే అధిక రాబడినే ఇచ్చిందని చెప్పుకోవాలి. ఎందుకంటే, ఒకవైపు దేశీయ ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్ లోకి అధిక నిధులు వెళుతున్నాయి. అదే సమయంలో బిట్ కాయిన్ వైపు చాలా మంది అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో బంగారం ఈ మాత్రమైనా ర్యాలీ చేయడం విశేషమేనన్నది నిపుణుల అభిప్రాయం. 2017లో మ్యూచువల్ ఫండ్స్ లోకి రూ.1.15 లక్షల పెట్టుబడులు వచ్చాయి. అయితే, ఈక్విటీ మార్కెట్లో భారీ ర్యాలీతో బంగారంలో ఇన్వెస్ట్ చేసిన వారికి కొంత నిరాశే ఎదురైంది.

బంగారం ధర, డాలర్ సూచీతో ముడిపడి ఉంటుంది. ఎందుకంటే, డాలర్ల మారకంలోనే బంగారం ట్రేడింగ్ అధిక భాగం జరుగుతుంది. అంటే డాలర్ కు వ్యతిరేక దిశలో బంగారం ధర చలిస్తుంది. కానీ, 2017లో డాలర్ ఇండెక్స్ క్షీణతకు మించి బంగారం పెరుగుదల ఉంది. డాలర్ విలువ క్షీణతకు ట్రంప్ సర్కారు వివాదాస్పద పాలసీలే కారణం. అమెరికా ఫెడరల్ రిజర్వ్ కమిటీ వడ్డీ రేట్లను క్రమంగా పెంచుతూ వెళుతోంది.

 అంతర్జాతీయంగా చూస్తే యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు ద్రవ్యపరమైన ప్రోత్సాహకాలను వెనక్కి తీసుకునే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. జపాన్ లో సలభతర విధానం, ఆర్థిక వృద్ధి దిశగా చైనా ప్రభుత్వం చేపట్టే చర్యలు అన్నీ కూడా బంగారం ధరలపై ప్రభావం చూపేంచేవే. ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకుల విధానాల కారణంగా ద్రవ్యోల్బణం నియంత్రణలోనే ఉంటుందని అంచనా.

ఈ నేపథ్యంలో 2018లో బంగారం ధరలను ప్రధానంగా నిర్ణయించేవి రెండు అంశాలు. ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు, అమెరికా మార్కెట్ల ర్యాలీకి బ్రేక్ పడుతుందా? లేక కొనసాగుతుందా? బ్రేక్ పడితే బంగారం మరోసారి వెలుగులోకి వస్తుంది. అలాగే డాలర్ విలువ కూడా బంగారం ధరలను నిర్ణయించేదే. అమెరికాలో ఆర్థిక రంగం మరింత బలోపేతమై డాలర్ విలువ పెరిగితే బంగారం ధరలపై ఒత్తిడి ఉంటుంది.

ఆర్థిక వృద్ధి, బంగారం ధరలు కలసికట్టుగా ప్రయాణించలేవు. 2017లో ప్రపంచ వృద్ధి రేటు 3.4 శాతం కాగా, ఇది 2018లో 3.6 శాతానికి చేరుతుందని భావిస్తున్నారు. వృద్ధి వేగం పుంజుకుంటే అది బంగారం ధరల పెరుగుదలకు శుభసూచికం కాదు. ‘‘బంగారానికి 27,000 స్థాయి సరైనది. పెట్టుబడుల వైవిధ్యం కోసం అయితే బంగారానికి 10 శాతం వరకు నిధులు కేటాయించుకోవచ్చు’’ అని ఏంజెల్ బ్రోకింగ్ చీఫ్ అనలిస్ట్ ప్రథమేష్ మాల్యా తెలిపారు.

More Telugu News