New York Times: అరగంట ఇంటర్వ్యూలో 24 తప్పుడు మాటలు చెప్పిన డొనాల్డ్ ట్రంప్... తిట్టిపోస్తున్న నెటిజన్లు!

  • న్యూయార్క్ టైమ్స్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ట్రంప్
  • ప్రతి 75 సెకన్లకూ ఓ అబద్ధం లేదా తప్పుడు స్టేట్ మెంట్
  • తీవ్ర గందర గోళానికి గురిచేసిన ట్రంప్ ఇంటర్వ్యూ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, గురువారం నాడు 'ది న్యూయార్క్ టైమ్స్'కు అరగంట పాటు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇవ్వగా, అందులో 24 సార్లు అబద్ధాలు, తప్పుడు ప్రకటనలు, అసత్య ఆరోపణలు చేశారని యూఎస్ పౌరులు తేల్చారు. సగటున ఆయన ప్రతి 75 సెకన్లకూ ఓ అబద్ధం లేదా తప్పుడు స్టేట్ మెంట్ చెప్పారని, తీవ్ర గందర గోళానికి గురి చేశారని ఇప్పుడు సోషల్ మీడియాలో పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.

ఈ కథనం మొత్తాన్ని సదరు పత్రిక ప్రచురించింది. రష్యన్‌ గూఢచర్యం దగ్గరి నుంచి మొదలుపెట్టి పలు సమస్యలు, పలు దేశాల సంబంధాలతో మాట్లాడిన ఆయన ఏ సమాధానాన్ని సక్రమంగా చెప్పలేదు. యూఎస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ సమయంలో మిచిగాన్‌, విస్కాన్‌ సిన్‌ ప్రాంతాల్లో హిల్లరీ క్లింటన్ ప్రచారానికి రాకపోగా, ఆ విషయాన్ని మరచిన ఆయన, ఓట‍్ల కోసం ఆ ప్రాంతాల్లో ఆమె అడ్డదారి తొక్కిందంటూ నోరు జారారు. పశ్చిమ వర్జీనియా ఎకనామిక్ కండిషన్ పై కూడా ట్రంప్ తప్పుడు లెక్కలు చెప్పారు.

పలు మధ్య ప్రాచ్య దేశాలకు అమెరికా అందించిన ఆర్థిక సహాయం విషయంలోనూ అవాస్తవాలు చెప్పారు. కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ప్రస్తావన రాగా, అది నేటి సమస్య కాదని, మూడు దశాబ్దాలుగా సాగుతోందని తప్పించుకున్నారు. మిత్ర దేశాలతో సంబంధాలపై ప్రశ్నలడిగితే తడబడ్డారు. కెనడా విషయంలో ఆయన లెక్కలు సుద్ధ తప్పు అని స్వయంగా ఆ దేశ ప్రధాని జస్టిన్‌ ట్రూడావో చెప్పడం గమనార్హం. ఇక ఈ ఇంటర్వ్యూపై అమెరికన్లు మండిపడుతున్నారు. అధ్యక్షుడిగా బాధ్యతతో మెలగాల్సిన ఆయన, ఇలా ప్రవర్తించడం సరికాదని హితవు పలుకుతున్నారు.

More Telugu News