Revanth Reddy: నేనెవరో తెలియకపోయినా పర్వాలేదు కేటీఆర్ సారూ.. ఆయనను మాత్రం ఎవరని అడగొద్దు.. కేటీఆర్‌కు రేవంత్ కౌంటర్!

  • కేటీఆర్ ట్విట్టర్ వ్యాఖ్యలపై స్పందించిన రేవంత్ రెడ్డి
  • శ్రీకాంతాచారి, కోదండరామ్ ఎవరని అడగొద్దని సూచన
  • మంత్రి లక్ష్మారెడ్డి గురించి తప్పుగా మాట్లాడలేదని వివరణ

తానెవరో తెలియదంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తానెవరో తెలియకపోయినా పర్వాలేదు కానీ.. తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి ఎవరు? అని మాత్రం అడగొద్దంటూ చురకలు అంటించారు. మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్‌లో శుక్రవారం నిర్వహించిన ‘మిడ్జిల్ ములాఖత్’లో రేవంత్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రెండు రోజుల క్రితం ట్విట్టర్‌లో నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు కేటీఆర్ బదులిచ్చారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ రేవంత్‌రెడ్డి గురించి ప్రస్తావించాడు. దీనికి కేటీఆర్ స్పందిస్తూ.. ‘ఆయన ఎవరు?’ అని ప్రశ్నించారు.

కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ తనను గుర్తుపట్టకపోయినా వచ్చిన ప్రమాదం ఏమీ లేదని, కానీ శ్రీకాంతాచారి, ప్రొఫెసర్ కోదండరామ్, కానిస్టేబుల్ కిష్టయ్య, కవితానాయక్, వేణుగోపాలరెడ్డిని గుర్తుపెట్టుకుంటే చాలని, వాళ్లని మాత్రం ‘ఎవరు?’ అని ప్రశ్నించవద్దని అన్నారు.

తెలంగాణను కాంగ్రెస్ ఇవ్వలేదన్న కేసీఆర్.. కుటుంబ సభ్యులతో కలిసి సోనియా నివాసానికి వెళ్లి ఆమె కాళ్లు పట్టుకుని కృతజ్ఞతలు చెప్పారని నిలదీశారు. కేసీఆర్‌ను గెలిపించి రాజకీయ భిక్ష పెట్టిందే పాలమూరు ప్రజలు అని గుర్తు చేశారు. జడ్చర్ల సభలో తానెవరినీ తక్కువ చేసి మాట్లాడలేదన్న రేవంత్‌ రెడ్డి మంత్రి లక్ష్మారెడ్డి చదువు గురించి మాత్రమే ప్రశ్నించానని స్పష్టం చేశారు. రెండేళ్లలో ఆయన డాక్టర్ కోర్సు ఎలా పూర్తి చేశారో చెప్పాలని మాత్రమే అడిగానన్నారు.

More Telugu News