fiscal deficit: లక్ష్యాన్ని దాటిపోయిన కేంద్ర ద్రవ్య లోటు... మోదీ సర్కారు ఏం చేస్తుందో...?

  • నవంబర్ నాటికే లక్ష్యంలో 112 శాతానికి చేరిక
  • జీఎస్టీ వసూళ్లు పడిపోవడమే కారణం
  • జీడీపీలో లోటు 3.2 శాతంగా ఉండాలన్నది కేంద్రం లక్ష్యం

మోదీ సర్కారు లక్ష్యానికి కట్టుబడి ఉండలేకపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తానికి కేంద్రం విధించుకున్న ద్రవ్యలోటు లక్ష్యం నవంబర్ లోనే దాటిపోయింది. 2017-18 బడ్జెట్ లో పేర్కొన్న అంచనాను దాటి 112 శాతానికి చేరింది. కేంద్ర సర్కారు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ఆదాయం తగ్గిపోవడమే లోటు పెరిగిపోవడానికి కారణం. ద్రవ్యలోటు అంటే, కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, వ్యయాల మధ్య అంతరం. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు రూ.6.12 లక్షల కోట్లుగా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ద్రవ్యలోటు నిర్ణీత లక్ష్యంలో 85 శాతంగానే ఉంది.

2017-18 సంవత్సరానికి ద్రవ్యలోటును జీడీపీలో 3.2 శాతానికి పరిమితం చేయాలన్నది మోదీ సర్కారు లక్ష్యం. జీఎస్టీ చట్టం ఈ ఏడాది జూలై నుంచి అమల్లోకి రాగా, ఆ తర్వాత పన్ను ఆదాయం నవంబర్ నెలలో అత్యంత కనిష్టానికి పడిపోవడం కేంద్రాన్ని ఇబ్బంది పెట్టే అంశమేనన్నది విశ్లేషకుల అంచనా. అక్టోబర్ లో జీఎస్టీ వసూళ్లు రూ.83,000 కోట్లు అయితే, నవంబర్ లో ఇవి రూ.80,808 కోట్లకు తగ్గాయి. దీంతో మోదీ సర్కారు ఎటువంటి దిద్దుబాటు చర్యలు తీసుకుంటుందో చూడాల్సిందే.

More Telugu News