Telangana: సర్కారు వెనకడుగు... తెలంగాణలో తగ్గనున్న జిల్లాల సంఖ్య!

  • తెలంగాణలో గతంలో 10 జిల్లాలు
  • 2016 దసరానాడు వచ్చి చేరిన మరో 21 జిల్లాలు
  • అధికారుల కొరత, ప్రయోజనాలు లేవని భావిస్తున్న ప్రభుత్వం
  • కొన్ని జిల్లాలను రద్దు చేసే ఆలోచనలో సర్కారు

తెలంగాణలోని 31 జిల్లాలపై కేసీఆర్ ప్రభుత్వం పునరాలోచనలో పడింది. జిల్లాల సంఖ్య అధికంగా ఉందని, దీనివల్ల అధిక జిల్లాలు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరకపోగా, పెద్దగా ప్రయోజనాలూ ఒనగూరలేదని భావిస్తున్న కేసీఆర్, కొన్ని జిల్లాలను తీసివేయాలని, అందుకు వెంటనే కసరత్తు ప్రారంభించాలని అధికారులను ఆదేశించినట్టు తెలుస్తోంది.

ప్రజల డిమాండ్లు, నేతల ఒత్తిళ్లతో ఏర్పాటు చేసిన వాటిపై పునరాలోచనలో పడిన ఆయన, సమర్థవంతమైన పాలనకు అవసరమైన జిల్లాలనే కొనసాగించాలని అధికారులతో చెప్పినట్టు సమాచారం. వరంగల్‌ అర్బన్, రూరల్‌ జిల్లాలను విలీనం చేయాలని, జనగాం, నిర్మల్, పెద్దపల్లి, మేడ్చల్‌ జిల్లాలను పక్క జిల్లాలతో కలపాలని కూడా ఆయన సూచన ప్రాయంగా చెప్పినట్టు అధికారులు వెల్లడించారు.

గతంలో తెలంగాణలో పది జిల్లాలు ఉండగా, 2016 దసరా నుంచి జిల్లాల సంఖ్యను 31కి పెంచిన విషయం విదితమే. ఒక్కసారిగా 21 జిల్లాలు వచ్చి చేరేసరికి, ఉద్యోగుల సంఖ్య పెరగడం, ఉన్న ఉద్యోగులను సర్దుబాటు చేయలేకపోవడం, కలెక్టర్ల కొరతతో రెండు జిల్లాల బాధ్యతలను ఒకే కలెక్టర్ చూస్తుండటం వంటి అంశాలను కూడా కేసీఆర్ అధికారులతో చర్చించారు.

వరంగల్, ఖాజీపేట, హన్మకొండ కలిసి ఉండగా, రెండు జిల్లాలు ఎందుకన్న సందేహాన్ని కేసీఆర్ వ్యక్తం చేయగా, వాటిని విలీనం చేద్దామని అధికారులు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. చివరి దశలో టీఆర్ఎస్ నేతల ఒత్తిళ్లతో ఏర్పాటైన జిల్లాలన్నింటినీ తొలగించేందుకు చర్యలు చేపట్టాలని, అంతకన్నా ముందు అక్కడి పార్టీ ముఖ్య నేతలు, ప్రజలు, అధికారుల అభిప్రాయాలను సేకరించాలని కేసీఆర్ సూచించినట్టు తెలుస్తోంది.

More Telugu News