India: శత్రు క్షిపణులు ఇక దారిలోనే అవుట్.. అగ్ర దేశాల సరసన భారత్!

  • శత్రుదేశాల క్షిపణులను దారిలోనే ధ్వంసం చేసే శక్తిగా భారత్
  • ప్రపంచంలోని అతి కొన్ని దేశాలకే ఈ వ్యవస్థ సొంతం 
  • చాందీపూర్ ప్రయోగం విజయవంతం

భారత అమ్ముల పొదిలోకి మరో శక్తిమంతమైన ఆయుధం వచ్చి చేరింది. శత్రుదేశాల క్షిపణులను మార్గమధ్యంలోనే ధ్వంసం చేసే అత్యాధునిక సాంకేతికతను విజయవంతంగా పరీక్షించింది. గురువారం ఒడిశాలో చాందీపూర్ సమీపంలోని అబ్దుల్ కలాం ద్వీపం నుంచి జరిపిన ప్రయోగం విజయవంతమైంది. దీంతో ఇటువంటి వ్యవస్థ కలిగిన అగ్రదేశాల సరసన భారత్ నిలిచింది. ఈ పరీక్షలో భాగంగా గురువారం ఓవైపు నుంచి పృథ్వి క్షిపణిని ప్రయోగించి దానిని లక్ష్యంగా చేసుకున్నారు. దానిని శత్రుక్షిపణిగా భావించి మరోవైపు నుంచి అడ్వాన్స్‌డ్ ఎయిర్ డిఫెన్స్ (ఏఏడీ)ని ప్రయోగించారు. 15 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత పృథ్వి క్షిపణిని ఏఏడీ గాలిలోనే ధ్వంసం చేసింది.

వాతావరణం కన్నా పై నుంచి, వాతావరణంలోనూ ప్రయాణించే రెండు రకాల క్షిపణులను శత్రుదేశాలు ప్రయోగిస్తుంటాయి. అవి లక్ష్యాన్ని చేరకముందే గాలిలోనే వాటిని గురిచూసి కొట్టే క్షిపణులను ఎయిర్ డిఫెన్స్ సూపర్ సోనిక్ ఇంటర్ సెప్టర్ మిసైల్స్ అంటారు. గురువారం భారత్ పరీక్షించింది ఈ క్షిపణులనే. ఇటువంటి సాంకేతికత కొన్ని దేశాల వద్ద మాత్రమే ఉంది. ఇప్పుడు అది భారత్ సొంతమైంది. దీనిని పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసినట్టు డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు తెలిపారు. భారత్ పరీక్షించిన ఏఏడీ బరువు 1.2 టన్నుల బరువు కాగా, పొడవు 7.5 మీటర్లు.

More Telugu News