triple talak bill: ట్రిపుల్ తలాక్ పై నోటీసులు ఇచ్చిన ఒవైసీ!

  • నేడు లోక్ సభ ముందుకు బిల్లు
  • వ్యతిరేకిస్తూ నోటీసిచ్చిన ఒవైసీ
  • బీజేపీ రెచ్చగొడతోందంటూ ఆగ్రహం

ట్రిపుల్ తలాక్ చెప్పేవారిని నేరస్తులుగా పరిగణించే కీలక ట్రిపుల్ తలాక్ సవరణ బిల్లు నేడు లోక్ సభ ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో, ఇది ముస్లిం చట్టాలకు విరుద్ధమంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. అంతేకాదు, సభలో బిల్లు ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఈ ఉదయం లోక్ సభ సెక్రటరీ జనరల్ కు నోటీసును అందించారు.

72వ నిబంధన ప్రకారం ఈ నోటీసును అందించినట్టు ట్విట్టర్ ద్వారా తెలిపారు. అయితే, తన నోటీసుపై చర్చకు అనుమతిస్తారా? లేదా? అనే విషయం మాత్రం వేచి చూడాలని ఆయన అన్నారు. ముస్లిం మహిళల రక్షణ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును రూపొందించిందని... తద్వారా ముస్లింలను దోషులుగా చూపే ప్రయత్నం చేస్తోందని ఆయన మండిపడ్డారు.

కేంద్ర ప్రభుత్వ చర్యలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయనే విషయం స్పష్టమవుతోందని చెప్పారు. ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డుతో సంప్రదించి, వారి సూచనల ప్రకారం చట్టాన్ని రూపొందించాలంటూ గతంలోనే కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కు ఆయన లేఖ రాశారు.

మరోవైపు ఈ బిల్లు నేపథ్యంలో బీజేపీ ఎంపీలంతా లోక్ సభకు హాజరుకావాలంటూ ఆ పార్టీ విప్ జారీ చేసింది. ముస్లిం మహిళా బిల్లు-2017ను కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలోని బృందం రూపొందించింది. ఈ బిల్లు చట్టరూపం దాల్చితే.. తలాక్ చెప్పిన వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా పడుతుంది.  

More Telugu News