Pakistan: ముత్తయిదువుని వితంతువుగా మారుస్తారా?: పాక్ పై రాజ్యసభలో సుష్మా స్వరాజ్ నిప్పులు

  • పాక్ జైల్లో మగ్గుతున్న కులభూషణ్ జాదవ్
  • కలిసొచ్చిన భార్య, తల్లి
  • భార్య బొట్టు, తాళి తీయించిన పాక్

పాకిస్థాన్ లో గూఢచారిగా, భారత ఉగ్రవాదిగా ముద్రపడి, ఉరిశిక్షకు గురై, 21 నెలలుగా జైల్లో ఉన్న కులభూషణ్ జాదవ్ ను ఆయన భార్య, తల్లి ఇస్లామాబాద్ లో కలసిన వేళ, పాక్ అధికారులు చేసిన అవమానంపై ఈ ఉదయం రాజ్యసభలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తీవ్రంగా మండిపడ్డారు. భారత సంస్కృతి, సంప్రదాయాలను పాకిస్థాన్ ఏ మాత్రం పట్టించుకోలేదని దుయ్యబట్టిన ఆమె, ఓ ముత్తయిదువును వితంతువుగా మారుస్తారా? అని ప్రశ్నించారు.

ఈ మేరకు రాజ్యసభలో ఓ ప్రకటన చేసిన ఆమె, భర్త బతికుండగానే నుదుటన కుంకుమ, తాళిబొట్టును, చేతి గాజులను ఏ భారత మహిళా తీయబోదని పాక్ అధికారులకు తెలియదా? అని ప్రశ్నించారు. ఆమె కట్టుకున్న చీరను బలవంతంగా విప్పించి, కుర్తా కట్టించడం కూడా అవమానించినట్టేనని అన్నారు. ఈ అవమానం జాదవ్ భార్యకు మాత్రమే కాదని, యావత్ భారత మహిళలకు జరిగిన అవమానమని నిప్పులు చెరిగారు. కనీసం వారిని తమ మాతృభాషలో కూడా మాట్లాడనివ్వలేదని విమర్శించారు. పాకిస్థాన్ వైఖరిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈ విషయాన్ని ఇప్పటికే తాను ఆ దేశ దౌత్యాధికారుల దృష్టికి తీసుకు వెళ్లానని అన్నారు.

More Telugu News