ఆది చేయాల్సిన సినిమా విజయ్ దేవరకొండకు వెళ్లిందా?

27-12-2017 Wed 15:59
  • సరైన హిట్ కోసం ఆది వెయిటింగ్
  • తమిళంలో ఛాన్స్ ఇస్తానన్న జ్ఞానవేల్ రాజా 
  • చివరికి ఆదికి మిగిలింది నిరాశే  
తెలుగులో యువ కథానాయకులతో పోటీపడుతూ .. తనదైన ప్రత్యేకతను చాటుకోవడానికి ఆది సాయికుమార్ ప్రయత్నిస్తున్నాడు. అయితే దురదృష్టవశాత్తు ఆయన చేసిన సినిమాలు అంతగా ప్రేక్షకులను అలరించలేకపోతున్నాయి. దాంతో తెలుగులో ఆయనకి సరైన అవకాశాలు రావడం లేదు. దాంతో తండ్రి మాదిరిగానే కన్నడలో ఎంట్రీ ఇవ్వాలనుకున్నాడు. అయితే ఆ విధంగా చేయడం వలన టాలీవుడ్ కి రాంగ్ సిగ్నల్స్ ఇచ్చినట్టు అవుతుందని వెనకడుగు వేశాడు.

 ఈ నేపథ్యంలోనే తమిళంలో ఆయనతో ఒక సినిమా చేస్తానని జ్ఞానవేల్ రాజా మాట ఇచ్చాడట. జ్ఞానవేల్ రాజా .. స్టూడియో గ్రీన్ సంస్థకి గల పేరు గురించి తెలిసిన ఆది సాయికుమార్, అక్కడి నుంచి ఎప్పుడు పిలుపు వస్తుందా అని ఎదురుచూస్తున్నాడు. తాజాగా ఆ సంస్థ విజయ్ దేవరకొండను తీసుకోవడంతో, ఆది సాయికుమార్ ఆలోచనలో పడ్డాడని అంటున్నారు. మొత్తానికి ఆది సాయికుమార్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ ప్రాజెక్టును విజయ్ దేవరకొండ తన్నుకు పోయాడన్న మాట.