Telangana: తెలంగాణలో ఎన్నడూ లేనంతగా పెరిగిన మద్యం ధరలు... ఏ బ్రాండ్ ధర ఎంత పెరిగిందంటే..!

  • ఉత్తర్వులు జారీ చేసిన ఎక్సైజ్ శాఖ
  • చౌక బ్రాండ్లపై గరిష్ఠంగా 12 శాతం భారం
  • హై ఎండ్ బ్రాండ్లపై 5 శాతం ధరల పెంపు
  • పేద, మధ్య తరగతిపై ప్రభావం

గతంలో ఎన్నడూ లేనంత భారీగా తెలంగాణలో మద్యం ధరలను పెంచుతూ కేసీఆర్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కనిష్ఠంగా 5 శాతం నుంచి గరిష్ఠంగా 12 శాతం వరకూ ధరలను పెంచుతూ, పెరిగిన ధరల్లో పన్నులు మినహా మిగతా అంతా డిస్టిలరీలకు అప్పగిస్తూ జీవో ఇచ్చింది. కార్టన్ ధర రూ. 700 లోపు ఉన్న చౌక బ్రాండ్లపై 12 శాతం, ఆపై రూ. 1000 వరకూ కార్టన్ ధర ఉండే బ్రాండ్లపై 10 శాతం, ఆపై ధర ఉన్న బ్రాండ్లకు 5 శాతం చొప్పున ధర పెరుగుతుందని పేర్కొంది.

 కాగా, ఈ ధరల ప్రభావం లగ్జరీ బ్రాండ్ లు, హై ఎండ్ బ్రాండ్లపై చూపే ప్రభావం అతి స్వల్పం కాగా, అత్యధికులు తాగే బ్రాండ్లపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతోంది. ఇక తెలంగాణ ఏర్పాటయ్యాక మద్యం ధరల సవరణపై ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన సిఫార్సు మేరకే నిర్ణయాలు తీసుకున్నామని ఎక్సైజ్ శాఖ పేర్కొంది. ఇక పెరిగిన ధరలు వివరాలు...

180 ఎంఎల్ క్వార్టర్ బాటిల్ ధరలు ఇలా ఉండనున్నాయి. రాయల్‌ గేమ్‌ ప్రస్తుత ధర రూ. 65 నుంచి రూ. 70కి, ఓల్డ్‌ టవెరన్‌ ప్రస్తుత ధర రూ. 80 నుంచి రూ. 90కి, ఆఫీసర్స్‌ చాయిస్‌ ప్రస్తుత ధర రూ. 90 నుంచి రూ. 100కు, ఏసీ ప్రీమియం, ఎంసీ విస్కీ, ఎంసీ బ్రాందీ, ఐబీ విస్కీ వంటి బ్రాండ్లు ప్రస్తుత ధర రూ. 110 నుంచి రూ. 120కి పెరగనున్నాయి.

ఇక మీడియం లిక్కర్ బ్రాండ్ల విషయానికి వస్తే, రాయల్‌ స్టాగ్‌ ప్రస్తుత ధర రూ. 150 నుంచి రూ. 165కు, రాయల్‌ చాలెంజ్‌ ప్రస్తుత ధర రూ. 210 నుంచి రూ. 225కు పెరగనున్నాయి. ప్రీమియం లిక్కర్‌ విషయానికి వస్తే, బ్లెండర్స్‌ ప్రైడ్‌ ప్రస్తుత ధర రూ. 240 నుంచి రూ. 260కి, సిగ్నేచర్‌ ప్రస్తుత ధర రూ. 250 నుంచి రూ. 275కు, 100 పైపర్స్‌ ప్రస్తుత ధర రూ. 410 నుంచి రూ. 480కి పెరగనున్నాయి.

More Telugu News