ఓ భారతీయుడా మేలుకో!: నూతన సంవత్సర వేడుకలపై స్వామి పరిపూర్ణానంద

26-12-2017 Tue 20:23
  • గ్రిగేరియన్ క్యాలెండర్ ప్ర‌కారం జ‌రుపుకునే ఈ వేడుక మ‌న‌కెందుకు?
  • ఎందుకు ఈ వింత పోకడ? మన గురించి మనకు తెలియకనా?
  • ఉగాదిని ప్రోత్స‌హిస్తే మ‌న తెలుగుని చాటి చెప్పిన‌ట్లే అవుతుంది
  • యుగ ఆది రోజుని ఉగాది రోజుగా నిర్ణయించినపుడు అదే అసలైన కొత్త సంవత్సరం

గ్రిగేరియన్ క్యాలెండర్ కాలమానం ప్రకారం జరుపుకునే ఆంగ్ల సంవత్సరం ఎంతవరకు మన భారతీయులకు ప్రామాణికం? అని రాష్ట్రీయ హిందూ సేన వ్యవస్థాపకుడు స్వామి పరిపూర్ణానంద ప్రశ్నించారు. ఈ రోజు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జనవరి 1న నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం మన సంప్రదాయం కాదని అన్నారు. మన ఋషులు అందించిన పంచాంగం.. ఖగోళ గ్రహగతులు, ఋతువులు, మరెన్నో సూక్ష్మ గణితముల ఆధారంగా నిర్దిష్టంగా నిర్ణయించినవని తెలిపారు. దీని ప్రకారం మనకు యుగ ఆదిని ఉగాది రోజుగా నిర్ణయించారని, అదే అసలైన కొత్త సంవత్సరం అని అన్నారు.

'మరి ఎందుకు ఈ వింత పోకడ? మన గురించి మనకు తెలియకనా? తెలిసినా నిద్రాణమా? ఓ భారతీయుడా మేలుకో! ప్రకృతి విరుద్ధ పండుగలకు స్వస్తి చెబుదాం.. ప్రకృతితో మమేకమైన ఉగాదితోనే ముందుకు సాగుదాం' అని పరిపూర్ణానంద పిలుపునిచ్చారు. ఉగాదిని ప్రోత్స‌హిస్తే మ‌న తెలుగుని చాటి చెప్పిన‌ట్లే అవుతుందని అన్నారు. భార‌తీయ విధానం ప్ర‌పంచ దేశాల కంటే ప్ర‌త్యేకమైన విధానమని అన్నారు.

'తెలుగువారికి తెలుగు భాష ఆత్మ‌గౌర‌వం. ఉగాది ఒక సౌర‌భం, ఒక చ‌రిత్ర. ఉగాది జ‌రుపుకోని వారు తెలుగు వారు ఎవ‌రైనా ఉంటే వారు తెలుగు వారు కానే కాదు.. వారు ఏ మ‌త‌స్తులైనా స‌రే ఉగాదిని జ‌రుపుకోక‌పోతే వారు తెలుగువారు కాదు.. సృష్టి ఆరంభాన్ని మ‌న పూర్వీకులు క‌నిపెట్టి ఉగాది రోజున ఆరంభం జ‌రిగింద‌ని చెప్పారు..  సైన్సు అభివృద్ధి చెంద‌క ముందే చంద్ర‌, సూర్య గ్ర‌హణాల గురించి మ‌న‌వారు రాసిపెట్టారు. ప్ర‌పంచ దేశాలు ఇప్ప‌టికీ మ‌న పూర్వీకులు వాటిని ఎలా లెక్క‌క‌ట్టారో తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు. ఆంగ్లేయుల క్యాలెండ‌ర్‌ని అనుస‌రించ‌క త‌ప్ప‌దు, కాక‌పోతే జ‌న‌వ‌రి 1 మాత్ర‌మే నూత‌న సంవ‌త్స‌రం అంటూ అంద‌రిపైనా రుద్దడం స‌రికాదు' అని పరిపూర్ణానంద తెలిపారు. తెలుగుని అంద‌రం గౌర‌విస్తున్న‌ప్పుడు తెలుగుద‌నం నిండిన ఉగాదిని కూడా గౌర‌విద్దాం అని పిలుపునిచ్చారు. ఉగాది రోజునే నూతన సంవ‌త్స‌ర వేడుకలు జ‌రుపుకోవాల‌ని సూచించారు.